
కోల్‌కతా: బ్యాటింగ్ వైఫల్యమే భారత్‌తో రెండో వన్డేలో తమ ఓటమికి ప్రధాన కారణమని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. అద్భుతమైన ఆరంభం దక్కినా.. తమ బ్యాటర్లు వినియోగించుకోలేకపోయారని చెప్పాడు. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డసన్ షనక.. కుల్దీప్ యాదవ్ తన స్పిన్‌తో తమ పతనాన్ని శాసించాడని తెలిపాడు. స్కోర్ బోర్డు మరో 30 పరుగులు ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతి బాగా మూవ్ అయ్యిందన్నాడు.
'సరైన లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయాం. అద్భుతమైన ఆరంభం లభించినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోయాం. ఇది ఫ్లాట్ వికెట్ అని, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని, 300 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశించాలని చర్చించుకున్నాం. కానీ కుల్దీప్ యాదవ్ తన స్పిన్‌తో మా మిడిల్ ఫేజ్ బ్యాటింగ్‌ను దెబ్బతీసాడు. ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటర్లు రాణించలేకపోయారు. బంతి మూవ్ అవ్వడంతో మాకు విజయవకాశం దక్కింది. బేసిక్స్‌కు కట్టుబడి బంతిని మూవ్ చేయాలని మా బౌలర్లకు చెప్పాను. కానీ స్కోర్ బోర్డుపై పరుగులు లేకపోవడంతో వారు ఏం చేయలేకపోయారు'అని డసన్ షనక చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. అరంగేట్ర ప్లేయర్ నువనిందు ఫెర్నాండో(50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లకు తోడుగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 43.2 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(103 బంతుల్లో 6 ఫోర్లతో 64 నాటౌట్) అండగా హార్దిక్ పాండ్యా(53 బంతుల్లో 4 ఫోర్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీయగా.. కసున్ రజిత, ధనంజయ డిసిల్వా చెరొక వికెట్ పడగొట్టారు.