మా జట్టులో అది లేకపోవడమే కొంపముంచింది: డసన్ షనక

న్యూఢిల్లీ: గెలవాలనే కసి తమ ఆటగాళ్లలో లేకపోవడంతోనే కలలో కూడా ఊహించని ఘోర పరాజయం ఎదురైందని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. గెలవాలనే తపన, పోరాటపటిమ ఉంటే తమ బౌలింగ్, బ్యాటింగ్ భిన్నంగా ఉండేదని చెప్పాడు. భారత్‌తో ఆదివారం ఏకపక్షంగా సాగిన మూడో వన్డేలో శ్రీలంక 317 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోర పరాజయం.
ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు 290 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఐర్లాండ్ పేరిట ఉండగా.. తాజా మ్యాచ్‌తో శ్రీలంక అధిగమించింది. ఈ పరాజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. ఈ ఘోర పరాజయం అనంతరం మాట్లాడిన డసన్ షనక.. ఇది సమష్టి వైఫల్యమని చెప్పుకొచ్చాడు. అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత్‌కు అభినందనలు తెలిపాడు.
'ఈ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది. మేం కలలో కూడా ఊహించని పరాజయం ఇది. అయితే కొన్నిసార్లు ఇలాంటి ఓటములు ఎదురవుతాయి. ఈ ఓటమి నుంచి మా బౌలర్లు, బ్యాటర్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇలాంటి విభిన్నమైన పిచ్‌పై వికెట్లు తీయడం ఎలా? పరుగులు చేయడం ఎలా? అనేది నేర్చుకోవాలి. బండారా, వాండర్సే గాయాలపై ఎలాంటి సమాచారం అందలేదు. సానుకూల దృక్పథంతో క్రికెట్ ఆడటం చాలా ముఖ్యం. గెలవాలనే ఉద్దేశంతో మా కుర్రాళ్లు ఆడి ఉంటే బౌలింగ్ భిన్నంగా ఉండేది. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇంటెంట్‌తో ఆడటం చాలా ముఖ్యం. ఈ తరహా క్రికెట్ ఆడిన భారత జట్టును ప్రత్యేకంగా అభినందించాల్సిందే'అని డసన్ షనక చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 నాటౌట్), శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116) శతక్కొట్టగా... కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(38) పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీయగా.. కరుణరత్నే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(4/32) ధాటికి 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. నువనిందు ఫెర్నాండో(19), డసన్ షనక(11), కసున్ రజిత(13 నాటౌట్) మినహా ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా..మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అషెన్ బండార గాయం కారణంగా బ్యాటింగ్ రాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications