పైలం పిలగా.. సచిన్‌కే తప్పలేదు: సౌతాఫ్రికా దిగ్గజం వార్నింగ్
విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ హెచ్చరించాడు. వైభవ్ సూర్యవంశీ దూకుడైన బ్యాటింగ్ శైలి భవిష్యత్తులో అతని కెరీర్‌కే ముప్పుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
శ్రీలంక పర్యటనలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా వైభవ్ సూర్యవంశీ.. ఫైనల్లో తన అసలు సిసలు ఆటతో పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన వైభవ్.. 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఒక్క సిక్సర్ దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు.
వైభవ్‌కు గాయాలయ్యే ఛాన్స్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి మాట్లాడిన కలినన్ భవిష్యత్తులో తీవ్రంగా గాయపడే అవకాశం ఉందని హెచ్చరించాడు. 'సూర్యవంశీ బ్యాటింగ్ శైలిని పరిశీలించిన బయోమెకానిక్స్ నిపుణులు.. అతని అసాధారణ 'హ్యాండ్ స్పీడ్', మణికట్టు, మోచేతుల కదలికలే అతని ప్రధాన బలమని తేల్చారు. అయితే, ఇదే అతని శరీరానికి తీవ్ర నష్టం కలిగించవచ్చని కలినన్ అభిప్రాయపడ్డాడు.

'సూర్యవంశీ ఆట నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ అతని గాయాల గురించి ఎవరూ మాట్లాడకపోవడం నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారీ బ్యాట్‌ను తిప్పుతూ.. విపరీతంగా క్రికెట్ ఆడటం వల్ల అతని మణికట్టు, మోచేతులు, కీళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది'అని కలినన్ చెప్పుకొచ్చాడు.
సచిన్‌కు టెన్నిస్ ఎల్బో గాయం..
2004లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎదుర్కొన్న టెన్నిస్ ఎల్బో గాయాన్ని కలినన్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. 'ఆ ఘోరమైన మోచేతి గాయం వల్ల సచిన్ కెరీర్ దాదాపు ముగిసిపోయే పరిస్థితి వచ్చింది. సచిన్ కూడా సూర్యవంశీ అంత వేగంగా, అన్ని సార్లు బ్యాట్ తిప్పేవాడు కాదు. ప్రస్తుత ఆధునిక కాలంలో బరువైన బ్యాట్లు వాడుతున్నారు. మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉంటోంది. రికవరీకి తగిన సమయం దొరకడం లేదు. సూర్యవంశీ ఇంకా ఎదుగుతున్న వయసులోనే ఉన్నాడు కాబట్టి, అతని కండరాలు, కీళ్లపై పడే భారాన్ని వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.'అని కలినన్ సూచించారు.
ఆధునిక ఫిట్‌నెస్ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన సుదీర్ఘ కెరీర్ కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కలినన్ హెచ్చరించాడు. అయితే ఇప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ ఆట గురించి మాత్రమే చాలా మంది మాజీ ఆటగాళ్లు మాట్లాడారు. కానీ కలినన్ అతని గురించి మరో కోణాన్ని మాట్లాడి అభిమానులను ఆలోచనలో పడేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

