భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ ఓటమి నుంచి తేరుకుంది. బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. క్రిస్టన్ క్లార్క్ బౌలింగ్‌లో సత్తా చాటగా.. డారిల్ మిచెల్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్( 92 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్(3/56) మూడు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, జాక్ ఫోక్స్, జైడన్ క్లార్క్, మైఖేల్ బ్రెస్‌వెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లకు 286 పరుగులు చేసి గెలుపొందింది. డారిల్ మిచెల్(117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 131 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. గ్లేన్ ఫిలిప్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు డెవాన్ కాన్వే(16), హెన్రి నికోల్స్(10) త్వరగానే ఔటయ్యారు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడగా.. కాన్వేను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్(10)ను ప్రసిధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేయగా.. విల్ యంగ్, డారిల్ మిచెల్ ఆదుకున్నారు.
ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ ఇద్దరూ ఆ తర్వాత దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో డారిల్ మిచెల్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... విల్ యంగ్ 68 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీ న్యూజిలాండ్ విజయానికి బాటలు వేసింది. సెంచరీ ముంగిట విల్ యంగ్(87)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 162 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్ సాయంతో డారిల్ మిచెల్ 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.