సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కివీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ హ్యారీ బ్రూక్(101 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 135) ఒక్కడే విధ్వంసకర శతకంతో చెలరేగగా.. జేమీ ఓవర్టన్(54 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 46) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జకారీ ఫౌల్స్క్(4/41) నాలుగు వికెట్లు తీయగా.. జకోబ్ డఫ్ఫీ(3/55) మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్‌కు ఒక వికెట్ దక్కింది.

అనంతరం న్యూజిలాండ్ 36.4 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. డారిల్ మిచెల్(91 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 నాటౌట్), మైఖెల్ బ్రేస్‌వెల్(51 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/45) మూడు వికెట్లు తీయగా.. లూక్ వుడ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
న్యూజిలాండ్ విజయంతో హ్యారీ బ్రూక్ శతకం వృథా అయ్యింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే బుధవారం జరగనుంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టీ20, మూడో టీ20 ఫలితం తేలకుండా ముగియడంతో రెండో టీ20లో విజయం సాధించిన ఇంగ్లండ్‌కు సిరీస్ దక్కింది.