భారత బౌలర్లు మరోసారి చేతులెత్తేసారు. ముఖ్యంగా స్పిన్నర్లు తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ 338 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137) తన నిలకడను కొనసాగిస్తూ మరో శతకంతో చెలరేగగా.. గ్లేన్ ఫిలిప్స్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106) విధ్వంసకర శతకంతో రాణించాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగులు చేసింది. కెప్టెన్ మైఖేల్ బ్రెస్‌వెల్(28 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/63), హర్షిత్ రాణా(3/84) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/43), కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే న్యూజిలాండ్ ఓపెనర్ హెన్రీ నికోల్స్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హర్షిత్ రాణా వేసిన మరుసటి ఓవర్‌లోనే మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(5) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన విల్ యంగ్, డారిల్ మిచెల్ ఆచితూచి ఆడి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. విల్ యంగ్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను జడేజా నేలపాలు చేశాడు. దాంతో తొలి పవర్ ప్లేలో న్యూజిలాండ్ 2 వికెట్లకు 47 పరుగులు చేసింది.

అనంతరం హర్షిత్ రాణా బౌలింగ్‌లో జడేజా సూపర్ క్యాచ్‌కు విల్ యంగ్(30) వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్‌కు వచ్చిన గ్లేన్ ఫిలిప్స్‌తో కలిసి డారిల్ మిచెల్ తన జోరును కొనసాగించాడు. తనకే సాధ్యమైన షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో అతను 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న గ్లేన్ ఫిలిప్స్.. ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది.
ఈ క్రమంలో గ్లేన్ ఫిలిప్స్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. డారిల్ మిచెల్ 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతనికి ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. మూడో 50 ప్లస్ స్కోర్. మరోవైపు దూకుడుగా ఆడిన గ్లేన్ ఫిలిప్స్ 83 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత స్పిన్నర్లను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది. 219 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అర్ష్‌దీప్ సింగ్ విడదీసాడు. గ్లేన్ ఫిలిప్స్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే డారిల్ మిచెల్‌ను సిరాజ్ ఔట్ చేశాడు.
తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ హే(2)ను కుల్దీప్ యాదవ్.., జాక్ ఫోక్స్(10)ను అర్ష్‌దీప్ సింగ్, క్రిస్టియన్ క్లార్క్(11)ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. మైఖేల్ బ్రెస్‌వెల్ దూకుడుగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆఖరి ఓవర్‌లో నాలుగు బంతులను డాట్ చేసిన సిరాజ్.. చివరి రెండు బంతుల్లో 10 పరుగులిచ్చుకున్నాడు.