ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలవాలంటే ముందు ఆతిథ్య భారత్‌ను ఓడించాలని వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ అభిప్రాయపడ్డాడు. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఓడించకుండా ఏ జట్టు ప్రపంచకప్ గెలవలేదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతను చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మెగా టోర్నీలో భారత బలాన్ని తెలియజేస్తున్నాయి.
ఒకప్పుడు క్రికెట్‌లో రారాజుగా వెలుగొందిన వెస్టిండీస్ ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటుంది. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచకప్ గెలిచి పూర్వ వైభవం అందుకోవాలనే కసితో ఉంది. గతంలో భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2016లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఆ విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో భారత్‌లో అడుగుపెట్టింది. స్కాట్లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో వెస్టిండీస్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన డారెన్ సామీ.. భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు.
'ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలవాలనుకునే ఏ జట్టు అయినా ముందుగా భారత్‌ను ఓడించాలి. భారత్‌ను ఓడించకుండా ఏ జట్టు కూడా టైటిల్ గెలవలేదు. అది నాకౌట్ రౌండ్ కావచ్చు. సెమీఫైనల్ లేదా ఫైనల్ కావచ్చు. సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. వారు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నారు. రాక్షసంగా కనిపిస్తున్న భారత జట్టును ఎదుర్కోవడం ప్రతీ జట్టుకు కష్టమవుతుంది.

సరిగ్గా పదేళ్ల క్రితం 2016 టీ20 ప్రపంచకప్‌లో ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్‌కు ముందు నేను మీడియా సమావేశంలో ఇదే చెప్పాను. ఆ సమయంలో మేం గెలుస్తామంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఆ రోజు మేం 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్‌ను ఓడించాం. ఆ తర్వాత ఫైనల్లో విజయం సాధించాం. ఇప్పుడు కూడా భారత్‌ను ఓడిస్తేనే టైటిల్ దక్కుతుంది.
ఇటీవల సౌతాఫ్రికాతో పరాజయం ఎదురైనప్పటికీ మా జట్టుపై పూర్తి నమ్మకం ఉంది. మా ఆటగాళ్లు అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ టైటిల్‌ను గెలవగలమని మేం నమ్ముతున్నాం. నమ్మకం లేకపోతే మేం ఇక్కడికి వచ్చేవాళ్లమే కాదు. వెస్టిండీస్ క్రికెట్‌కు గొప్ప చరిత్ర ఉంది. 70ల ఆధిపత్యం నుంచి 2012, 2016 విజయాల వరకు గొప్ప అనుభూతులు ఉన్నాయి. ఈ జట్టు కూడా తమకంటూ ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఆ నమ్మకం నాకుంది.’అని డారెన్ సామీ చెప్పుకొచ్చాడు.