Danish Kaneria: అవమానం లేదు తొక్కలేదు.. అన్నీ అర్జున రణతుంగ కథలు!

కరాచీ: శ్రీలంక పర్యటనకు భారత్.. బలమైన జట్టు కాకుండా బలహీనమైన బీ టీమ్‌ను పంపించి తమ దేశ క్రికెట్‌ను అవమానపరిచిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం లైమ్‌లైట్‌లో ఉన్నానని తెలియజేసేందుకే రణతుంగ ఇలాంటి చౌకబౌరు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించాడు. ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. మరోవైపు శిఖర్ ధావన్ సారథ్యంలోని మరో జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి తగ్గించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ టూర్ సక్సెస్ అయితే భవిష్యత్తులోనూ ఏకకాలంలో భారత జట్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

మా వాళ్లకు బుద్ది లేదు..
అయితే టీమిండియా బీ టీమ్ రావడం తమదేశ క్రికెట్‌కు అవమానమన్న రణతుంగ.. టీమిండియా సెకండ్ టీమ్‌తో సిరీస్‌లకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు బుద్ది లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇలా భారత రెండో జట్టు శ్రీలంక పర్యటనకు రావడం మా దేశ క్రికెట్‌ను అవమానించడమే. టెలివిజన్ మార్కెటింగ్ అవసరాల నేపథ్యంలో ఈ సిరీస్‌కు లంక బోర్డు అంగీకరించినట్లు అర్థమవుతోంది. భారత్ తమ బలమైన జట్టును ఇంగ్లండ్‌కు పంపించి బలహీనమైన రెండో జట్టును శ్రీలంకకు పంపించింది. దీనికి మా దేశ క్రికెట్ బోర్డు అసమర్థతతనే కారణం'అని రణతుంగా అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అడ్మినిస్ట్రేషన్ లోపాల కారణంగా తమ దేశ ఆటగాళ్లకు క్రమశిక్షణ లేకుండా పోయిందని, బోర్డును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నాడు.

లైమ్ లైట్‌లో ఉండేందుకే..
ఇక రణతుంగ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక పర్యటనకు పంపిన జట్టు బలహీనం కాదని, ముందు ఆ జట్టుపై విజయం సాధించాలని చురకలంటిస్తున్నారు. ఈ క్రమంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా రణతుంగ వ్యాఖ్యలపై మాట్లాడిన డానిష్ కనేరియా.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'లైమ్‌లైట్‌లో ఉండేందుకే రణతుంగ ఈ తరహా కామెంట్స్ చేశాడు. 50-60 మంది అంతర్జాతీయ స్థాయిలో ఆడగలిగే ఆటగాళ్లు దేశం భారత్. ఒకేసారి రెండు అంతర్జాతీయ జట్లను బరిలోకి దింపే సత్తా ఇండియాకు ఉంది. శ్రీలంక పర్యటనకు వచ్చిన ఆటగాళ్లలో చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్లే. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ అంతా స్టార్ ప్లేయర్లే. అలాంటి టీమ్‌పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విచారకం'అని కనేరియా చెప్పుకొచ్చాడు.

శ్రీలంక అదృష్టం..
ఇక శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఒప్పుకోవడమే గొప్ప విషయమని, ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో నుంచి భారత్‌తో జరిగే ఈ సిరీస్‌లు లంక క్రికెట్ బోర్డు కోలుకునేలా చేస్తాయని కనేరియా తెలిపాడు. భారత్ జట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసేముందు సిరీస్‌లకు ఒప్పుకున్నందుకు అదృష్టవంతులుగా ఫీలవ్వాలన్నాడు. 'రోజు రోజుకు శ్రీలంక క్రికెట్ దారుణంగా తయారవుతోంది. అసలు వాళ్లు క్రికెట్ ఆడటమే మరిచిపోయారా? అనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. టీ20, వన్డే సిరీస్‌ల్లో ఆ జట్టు క్లీన్ స్వీప్ అయింది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకతో సిరీస్‌లు ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు ఒప్పుకోవడమే గొప్ప విషయం. తమ అదృష్టంగా ఆ జట్టు భావించాలి. ఎందుకంటే ఈ ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక క్రికెట్‌కు ఈ సిరీస్‌లు ఎంతో ఊరటనిస్తాయి.'అని కనేరియా అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications