పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్, స్టార్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌లపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శలు గుప్పించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో దారుణంగా విఫలమైన ఈ ఇద్దరిపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ పసికూన జట్లు అయిన జింబాబ్వే, ఐర్లాండ్‌పై మాత్రమే చెలరేగుతారని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్.. లీగ్ దశలోనే ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే. పసికూన అమెరికాతో పాటు భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్.. కెనడా, ఐర్లాండ్‌పై విజయం సాధించినా సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. పాకిస్థాన్ పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించడంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా డానిష్ కనేరియా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజ్వాన్, బాబర్ ఆజామ్‌లపై మండిపడ్డాడు. 'పాకిస్థాన్ సెలెక్టర్లు ఓ పనికిరాని జట్టును ఎంపిక చేశారు. వాళ్లు పదే పదే బాబర్-రిజ్వాన్‌పై ఆధారపడుతున్నారు. అసలు బాబర్-రిజ్వాన్ ఏం చేశారు? ప్రధాన టోర్నీల్లో ఆడిన ప్రతీసారి ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు.
జింబాబ్వే, ఐర్లాండ్ వంటి పసికూన జట్లపై మాత్రమే ఆడారు. ఆ జట్లపై పరుగులు చేసిన బాబర్ ఆజామ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చడం ప్రారంభించారు.
భారత్‌కు ప్రపంచకప్ అందించిన గ్యారీ కిర్‌స్టన్‌ను పాక్ కోచ్‌గా నియమించి మంచి పని చేశారు. అయితే అతనికి కొన్ని నెలలు సమయం ఇవ్వాలి. వచ్చిరాగానే ఫలితాలు తెచ్చేందుకు అతనేం మెజిషియన్ కాదు.
పాకిస్థాన్ క్రికెట్‌లో చాలా రాజకీయాలు ఉంటాయి. ఈ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి గ్యారీ కిర్‌స్టన్‌కు చాలా సమయం పడుతుంది. కాబట్టి అతను తన పనిని మొదలు పెట్టేందుకు తగిన సమయం ఇవ్వాలి. ప్రతిభ కలిగిన దేశవాళీ ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వకపోవడం పాకిస్థాన్ క్రికెట్‌కే సిగ్గు చేటు. చాలా మంది కుర్రాళ్లు తమ అసాధారణ ప్రదర్శనతో వెలుగులోకి వచ్చారు. కానీ వారికి తగిన అవకాశాలు ఇవ్వలేదు.
ఎప్పుడు ఆడని అమెరికాలో ప్రపంచకప్ ఉన్నప్పుడు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్థాన్.. ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లు ఆడింది. ఇక్కడి పరిస్థితులు అమెరికా కండిషన్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి. వామప్ మ్యాచ్‌లు ఆడేందుకు కూడా పాక్ జట్టు నిరాకరించింది. చివరకు మూల్యం చెల్లించుకుంది.'అని డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు.