
న్యూఢిల్లీ: ఓ వైపు ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు యూకే పర్యటనకు వెళ్తుండగా.. మరోవైపు అదే సమయంలో మరో జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఇప్పటికే ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) క్లారిటీ ఇవ్వడంతో పాటు రెండో జట్టుకు కోచ్‌గా భారత మాజీ క్రికెటర్, ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించింది.
ఇంగ్లండ్ పర్యటనకు సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, ఆర్.అశ్విన్‌తో కూడిన జంబో జట్టును ఎంపిక చేయగా.. శ్రీలంక టూర్‌కు వెళ్లే జట్టు టీమ్ ఇంకా ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో పాటు భారత్-ఏ తరఫున రాణిస్తున్న ప్లేయర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కనుంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఈ జట్టు సారథ్య బాధ్యతలు దక్కనున్నాయి.
అయితే లంక పర్యటనలో టీమిండియాను విధ్వంసకర బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ నడిపిస్తే బాగుంటుందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. టీమిండియా భవిష్యత్తుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా బీ టీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'శ్రీలంక పర్యటనకు వెళ్లే రెండో భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పృథ్వీ, సంజూ శాంసన్‌కు జట్టు బాధ్యతలు ఇవ్వకపోవచ్చు. అయితే నా అభిప్రాయం ప్రకారం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంజూ శాంసన్‌ను కెప్టెన్ చేస్తే బాగుంటుంది. విరాట్ కోహ్లీ సారథిగా తప్పుకునే సమయానికి మరో కెప్టెన్‌ను సిద్దం చేసినట్లు ఉంటుంది.
పై విరాట్‌కు ప్రత్యామ్నాయంగా మరో సారథిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను సంజూ శాంసన్ కెప్టెన్ అయితే బాగుటుందనుకుంటున్నా. శిఖర్ ధావన్ తర్వాతే అతనే నాకు సరైన వాడనిపిస్తుంది. వన్డేలు, టీ20ల్లో శిఖర్ ధావన్‌కు చాలా అనుభవం ఉంది. కానీ తదుపరి కెప్టెన్‌ను గుర్తించి అతడు ఎదగడానికి అవకాశాలు కల్పించేందుకు శ్రీలంక టూర్ టీమిండియాకు బాగా ఉపయోగపడనుంది. హార్దిక్ పాండ్యాను కూడా పరిశీలించవచ్చు.'అని కనేరియా పేర్కొన్నాడు. అదే సమయంలో సంజూ కూడా టీమ్‌లో చోటును పదిలపర్చుకునేలా రాణించాలని సూచించాడు. ద్రవిడ్ పర్యవేక్షణలోని భారత రెండో జట్టు జూలైలో శ్రీలంకలో అడుగుపెట్టనుంది. అక్కడ జూలై 13 నుంచి 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.