
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్, అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ ఫొటో తీవ్ర చర్చనీయాంశమైంది. దాంతో ఆ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 అర్దాంతరంగా వాయిదా పడటంతో ఇంటికి వెళ్లిన ఈ సన్‌రైజర్స్ హైదారాబాద్ స్పిన్నర్.. ఈ విపత్కర కాలంలో అందరూ ఇంట్లోనే భద్రంగా ఉండాలని, మాస్క్ తప్పని సరి వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఇంట్లో దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు.
అయితే ఈ ఫొటోలోని రషీద్ ఖాన్ ఇంటిని చూసి అంతా అవాక్కయ్యారు. ఓ పెద్ద ప్యాలెస్‌లా కనిపిస్తున్న ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్ అయితే వాటే ప్యాలెస్ అంటూ నోరెళ్ల బెట్టింది. రషీద్ సహచర సన్‌రైజర్స్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్ కూడా కామెంట్ చేయగా.. భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఇంటికి సంబంధించిన మరిన్ని ఫొటోలను షేర్ చేయాలని కోరాడు. దాంతో ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. రాజుల కాలం నాటి ప్యాలెస్‌ను తలపిస్తున్న ఆ ఇల్లు చూడముచ్చటగా ఉంది.


అత్యంత కట్టుదిట్టమైన బయో బబుల్ మధ్య సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021పై కరోనా కమ్మేసింది. బబుల్‌ను చీల్చికొని దూసుకొచ్చిన ప్రాణాంతక వైరస్.. వేగంగా ఆటగాళ్లకు సోకింది. దాంతో బీసీసీఐ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ ఎప్పుడూ నిర్వహిస్తామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. రషీద్ ఖాన్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు.
లీగ్ వాయిదా పడే సమయానికి 29 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. మరో 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్‌లో ఈ క్యాచ్ రిచ్ లీగ్ సెకండ్ ఫేజ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు చేస్తుంది. ఇప్పటికే యూఏఈ, ఇంగ్లండ్ వేదికలను పరిశీలిస్తోంది.