
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టడంపై న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నయా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ తీసుకున్న ఈ నిర్ణయం తనకు నచ్చలేదన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆశ్చర్యకరంగా యుజ్వేంద్ర చాహల్‌ను కాదని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటిచ్చారు. అతను టీమ్‌మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెడుతూ రెండు కీలక వికెట్లతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు.
అయితే వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం సిద్దమవుతోన్న భారత జట్టు అశ్విన్‌ను తీసుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని వెటోరి చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో నిలకడగా రాణించిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు చోటిచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్.. అదే ఐపీఎల్‌లో చక్కగా వికెట్లు తీసిన చాహల్‌ని పక్కనపెట్టడం బాధాకరమని వెటోరీ చెప్పుకొచ్చాడు.
'ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశమిచ్చారు. కానీ.. అదే కోణంలో చాహల్‌కు ఎందుకు అవకాశమివ్వడం లేదు. అశ్విన్ ఎలా బౌలింగ్ చేయగలడో మనందరికీ తెలుసు. కానీ.. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో అశ్విన్‌కి తుది జట్టులో చోటివ్వగలరా? కానీ.. చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2021లో కోహ్లీ అతడ్ని వికెట్ టేకింగ్ బౌలర్‌గానే చూశాడు. ఇప్పుడు టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్లలో చాహల్ కూడా ఒకడు. అతను బంతిని చక్కగా టర్న్ చేయగలడు.. అలానే స్టంప్స్‌కి అటాక్ చేయగలడు. కాబట్టి.. భారత్ జట్టులో ఉండేందుకు అతను అర్హుడు''అని వెటోరీ చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి గత కొంతకాలంగా చాహల్‌కి టీ20ల్లో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్ జట్టులో అతనికి చోటివ్వని భారత సెలెక్టర్లు.. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కి మాత్రం ఎంపిక చేశారు. దాంతో అతను తుది జట్టులోకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన అశ్విన్,అక్షర్ పటేల్‌కు చోటిచ్చాడు.
తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్ చాప్‌మన్ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.