CWG 2022: మొబైల్‌లో అమ్మాయిల ఫైనల్ మ్యాచ్‌ను చూసిన రోహిత్ సేన.. ఫొటోలు వైరల్!

ఫ్లోరిడా: కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత్ తృటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో ఒత్తిడికి చిత్తయిన హర్మన్‌ప్రీత్ సేన 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే.. స్వర్ణం చేజారినా అమ్మాయిలు తమ ప్రదర్శన అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఇక చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్ పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతోపాటు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ పురుషుల జట్టు కూడా ఆసక్తిగా వీక్షించడం విశేషం. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
టెన్షన్ టెన్షన్‌గా రోహిత్ సేన..
ఆసాంతం ఉత్కంఠగా సాగిన అమ్మాయిల ఫైనల్ మ్యాచ్‌ను రోహిత్ సేన ఫ్లోరిడాలో మొబైల్ ఫోన్‌లో వీక్షించింది. రోహిత్ ఫోన్‌ను చేతిలో పట్టుకొని కూర్చోగా.. మిగతా ఆటగాళ్లంతా అతడి చుట్టూ గుమిగూడి మరీ మ్యాచ్‌ను తిలకించడం విశేషం. ఆ సమయంలో అందరి ముఖాల్లో.. ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కనిపించింది. ఈ ఫొటోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అభిమానులతో పంచుకుంది. 'కామన్వెల్త్‌లో మహిళల ఫైనల్.. ఎడ్జ్‌బాస్టన్‌లో ఉత్కంఠ. ఫైనల్ మ్యాచ్‌ను సీనియర్ మెన్స్ టీమ్ ఫాలోఅవుతోందిలా' అని ఆ ఫోటోకు కాప్షన్ ఇచ్చారు.
ఒత్తిడిని అధిగమించలేక..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులే చేసింది. ఆసీస్ బ్యాటర్లలో బెత్ మూనీ(61), కెప్టెన్ మెగ్ లాన్నింగ్(36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. స్వింగ్ కింగ్ రేణుకా సింగ్(2/25), స్నేహ్ రాణా(2/38) రెండేసి వికెట్లు తీయడంతో పాటు దీప్తి శర్మ(1/30), రాధా యాదవ్(1/24) చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు షెఫాలి (11), స్మృతి (6) త్వరగా వెనుదిరిగినా.. జెమీమా (33)తో కలిసి హర్మన్‌ప్రీత్ (65) పోరాడడంతో 14 ఓవర్లకు 112/2తో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. గార్డ్‌నర్ (3/16), షట్ (2/27) భారత్‌ను దెబ్బతీసారు
టీమిండియా జోరు..
మరోవైపు టీమిండియా పురుషుల జట్టు వెస్టిండీస్ పర్యటనను ఘనంగా ముగించింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. చివరిదైన అయిదో మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. శ్రేయస్ అయ్యర్ (64; 40 బంతుల్లో 8×4, 2×6) చెలరేగడంతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్ తడబడింది. రవి బిష్ణోయ్ (4/16), అక్షర్ పటేల్ (3/15), కుల్‌దీప్ యాదవ్ (3/12) ధాటికి 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications