
తండ్రి అంత్యక్రియలకు డబ్బుల్లేక...
పశ్చిమబెంగాల్‌లోని డియోల్పూర్ అచింత షెవులి స్వగ్రామం. హౌరా నుంచి సుమారు రెండు గంటల ప్రయాణం. అచింత తండ్రి దినసరి కూలీ. తల్లి టైలరింగ్ చేసేది. అతనికి ఓ అన్న అతని పేరు అలోక్. అయితే అచింతకు ఊహ తెలిసేనాటికే తండ్రి చనిపోయాడు. 2014లో అచింత తండ్రి మరణించగా.. అప్పటికీ అతని వయసు 13 ఏళ్లు మాత్రమే. తండ్రి దహన సంస్కారాలు చేయడానికి కూడా ఆ కుటుంబం దగ్గర చిల్లి గవ్వలేదు. ఇరుగుపొరుగు వాళ్లు ఇచ్చిన సాయంతో ఆ కార్యక్రమం పూర్తి చేశారు. తండ్రి అకాల మరణంతో అన్న కుటుంబ బాధ్యతలను తీసుకున్నాడు. చదువు మానేసి దినసరి కూలి, హమాలీగా జీవనాన్ని కొనసాగించాడు. అతనికి అండగా అచింత కూడా నిలిచాడు. అన్నతో కలిసి హమాలి పని చేయడంతో పాటు అమ్మ టైలరింగ్ పనికి సాంయ చేసేవాడు. ఆమె కోసం కుట్లు అల్లికల పని కూడా నేర్చుకున్నాడు.

వెయిట్ లిఫ్టింగ్ అన్న కల..
అచింత అన్నకు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టం. వాస్తవానికి అతడే వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్నాడు. కానీ తండ్రి మరణంతో అది సాధ్యం కాలేదు.
అన్నా తమ్ముళ్లు కలిసి ఊళ్లో వడ్ల బస్తాలు మోసేందుకు వెళ్లేవారు. ఒక్క బస్తా మోస్తే ఒక రూపాయి ఇచ్చేవారు. కామన్వెల్త్ గేమ్స్‌లో 313 కిలోల బరువెత్తిన అచింత.. చిన్నవయసులోనే క్వింటాళ్లకు క్వింటాళ్ల వడ్ల బస్తాలు మోసాడు. ఒక్కోసారి డబ్బులు ఇవ్వకుంటే రోజంతా బస్తాలు మోశాక సాయంత్రం చికెన్ కూరతో భోజనం పెట్టేవారు. పని నుంచి సాయంత్రం ఇంటికి రాగానే అమ్మకు కోల్‌కతా నుంచి వచ్చే కుట్లు, అల్లికలు (ఎంబ్రాయిడరీ వర్క్స్) పనిలో సాయం చేసేవారు. అంతా చేస్తే వారానికి వారు సంపాదించే ఆదాయం వారానికి రూ. 1,200 మాత్రమే. దాంతో అన్నదమ్ములిద్దరూ ఇదే పని చేయాలని నియమమేమీ పెట్టుకోలేదు. వాళ్ల కడుపు నింపే పనేదైనా సరే.. చేసేశారు.

తమ్ముడితో తన కలను..
అలోక్ చదువు మానేసినా తమ్ముడిని మాత్రం బడి మాన్పించలేదు. చిన్నప్పట్నుంచే తనతో పాటు తమ్ముడికి కూడా వెయిట్ లిఫ్టింగ్‌లో ఇంటిదగ్గరే శిక్షణ ఇప్పించిన అలోక్.. తమ్ముడు స్కూల్, మండల, జిల్లా స్థాయిలలో పతకాలు తీసుకువస్తుంటే అతడు ఇక్కడే ఆగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. దినసరి కూలీ, ఎంబ్రాయిడరీ వర్క్స్ తో పని అవదని కోల్‌కతాకు మకాం మార్చాడు. అక్కడ ఓ వేర్ హౌజింగ్ సంస్థలో పనికి కుదిరాడు. పొద్దున 8 నుంచి సాయంత్రం 6 వరకు గొడ్డు కష్టం చేసేవాడు. అన్న కష్టం చూసిన అచింత సీరియస్‌గా ట్రైనింగ్‌పై దృష్టిపెట్టాడు.

అక్కడే టర్నింగ్ పాయింట్..
2014లో నేషనల్ చాంపియన్స్‌లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ యూత్ కేటగిరీలో పాల్గొన్న అచింత.. నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే అతని ప్రతిభను గుర్తించిన కోచ్ అస్టోమ్ దాస్.. అచింతను పూణెలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ (ఏఎస్ఐ)కు తీసుకెళ్లాడు. అక్కడ అచింత జీవితం మరో మలుపు తిరిగింది. రోజుకు మూడు పూటలు తిండితో పాటు సరైన శిక్షణ లభించింది. ఏఎస్ఐలో రాటుదేలిన అచింత.. 2018లో ఆసియన్ యూత్ ఛాంపియన్షిప్స్ లో సిల్వర్ గెలిచాడు. గతేడాది జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ పోటీల్లో రజతం నెగ్గాడు. పతకాల వేట ప్రారంభమయ్యాక అచింత వెనుదిరిగి చూసుకోలేదు..

ఆర్మీ ఉద్యోగిగా..
షెవులి పతకాలు నెగ్గడం ప్రారంభమయ్యాక గుర్తింపుతో పాటు అతడికి జీవితం మీద 'భద్రత' కూడా లభించింది. ఖేలో ఇండియా గేమ్స్ లో స్వర్ణం సాధించాక అతనికి భారత ఆర్మీలో హవిల్దార్ గా ఉద్యోగం వచ్చింది. నెలకు రూ. 10వేల స్టైఫండ్ కూడా లభించింది. షెవులి ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నది కూడా ఆ డబ్బులతోనే. ఇంతవరకూ అతడు దానిని మార్చలేదు. షెవులి అంతో ఇంతో సంపాదిస్తుండటంతో తన తల్లి టైలరింగ్ మానేసింది. అన్న కూడా తన 'పాత లక్ష్యం' కోసం మళ్లీ సాధన మొదలుపెట్టాడు.
కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం నెగ్గాక షెవులి నోట వచ్చిన తొలి మాట కూడా తన అన్న గురించే. తన పతకాన్ని అన్నకు అంకితమిచ్చాడు. తన అన్నవల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని భావోద్వేగానికి లోనయ్యాడు. భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన ఈ అన్నదమ్ములిద్దరని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications












