ముంబై: వన్డే ప్రపంచకప్ 2023లో శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. క్లాసెన్ కాక, మార్కో మావ, మార్కరమ్ మామ దుమ్మురేపారు. క్లాసెస్ కాక విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగితే మార్కో మామ ఊర మాస్ బ్యాటింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కెప్టెన్‌గా మార్క్‌రమ్ మామ సత్తా చాటాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సన్‌రైజర్స్ త్రయం ధాటికి డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సన్‌రైజర్స్ ఆటగాళ్ల సంచలన ప్రదర్శనకు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఫిదా అవుతున్నారు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇదే జోరు కొనసాగిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగుండదని జోస్యం చెబుతున్నారు.

మార్కో మావ హిడెన్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా లోయరార్డర్‌లో ఆడపా దడపా మెరుపులు మెరిపించడం మాత్రమే చూసిన అభిమానులు.. అతని విధ్వంసకర బ్యాటింగ్‌కు అవాక్కయ్యారు. మార్కో మావతో సన్‌రైజర్స్ లోయరార్డర్ బలం పెరిగినట్లేనని భావిస్తున్నారు. ఈ సఫారీ త్రయం ప్రపంచకప్‌లో ఇదే జోరును కొనసాగించాలని, ఐపీఎల్‌లోనూ రాణించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఈ త్రయం రాణిస్తే.. ఐపీఎల్ 2024 సీజన్‌లో టీమ్ ఓనర్ కావ్య మారన్ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని కామెంట్ చేస్తున్నారు. కావ్య పాప నవ్వితే తమకు చానెల్స్ మార్చుకునే పరిస్థితి ఉండదని సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. కావ్య పాప నొచ్చుకోవడం తమిళ సూపర్ స్టార్ రజనీకాంతే తట్టుకోలేకపోయాడని, ఆ పరస్థితి మళ్లీ రావద్దని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సఫారీ విజయాన్ని సన్‌రైజర్స్ అభిమానులు తెగ ఆస్వాదిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రీచ్ క్లాసెన్(67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రీజా హెండ్రీక్స్(75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 85), రాసీ వాన్ డెర్ డస్సెన్(61 బంతుల్లో 8 ఫోర్లతో 60), మార్కో జాన్సెన్(42 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లీ(3/63) మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్(2/61), గస్ అట్కిన్సన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 22 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. గెరాల్డ్ కోయిట్జ్ (3/35) మూడు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి(2/26), మార్కో జాన్సెన్(2/35) రెండేసి వికెట్లు తీసారు. కగిసో రబడా, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.