
గత వైభవాన్ని మళ్లీ చూద్దలేం
ఆంటిగ్వాలోని టాక్ స్పోర్ట్స్ లైవ్‌లో కర్ట్‌లీ అంబ్రోస్ మాట్లాడుతూ... 'మేము ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా ఉన్నప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మన్నలు అందుకున్నాము. విండీస్ మంచి జట్టు అని పేరొందింది. వెస్టిండీస్ గత వైభవాన్ని నేను మళ్లీ చూస్తానని అనుకోవట్లేదు. ఇతర జట్లకు వెస్టిండీస్ గట్టి పోటీ ఇవ్వొచ్చు, ఐసీసీ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకోవచ్చు కానీ ఆ రోజులను మాత్రం తలపించదు. క్రికెట్‌తో వెస్టిండీస్‌కు ఉన్న అనుబంధం ఈతరం కుర్రాళ్లలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కరీబియన్ ప్రజలను నిజంగా కలిపే ఏకైక క్రీడ క్రికెట్ మాత్రమే' అని అన్నారు.

అలాంటి ఆటగాళ్లు ఇప్పుడు రావడం కష్టం
'నా ఉద్దేశం ఇప్పుడున్న విండీస్ క్రికెటర్లను అగౌరవపరచడం కాదు. గొప్ప ఆటగాళ్లుగా ఎదిగే సమర్థత ఉన్న ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో కొందరున్నారు. కానీ ఎప్పటికైనా విండీస్ క్రికెట్‌కు పూర్వవైభవం వస్తుందని నేను అనుకోవట్లేదు. వివ్ రిచర్డ్స్, డెస్మండ్ హేన్స్, గోర్డాన్ గ్రీనిడ్జ్, బ్రియాన్ లారా, రిచీ రిచర్డ్సన్, మాల్కం మార్షల్, మైఖేల్ హోల్డింగ్, కర్ట్‌లీ అంబ్రోస్, ఆండీ రాబర్ట్స్, క్లైవ్ లాయిడ్ ఇలా చెప్పుకుంటూ పొతే జాబితా కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి ఆటగాళ్లు ఇప్పుడు రావడం చాలా కష్టం' అని కర్ట్‌లీ అంబ్రోస్ పేర్కొన్నారు. 1988 నుంచి 2000 వరకు వెస్టిండీస్‌కు ఆడిన 57 ఏళ్ల ఆంబ్రోస్ 98 టెస్టుల్లో 405 వికెట్లు పడగొట్టారు. 176 వన్డేల్లో 225 వికెట్లు తీశారు.
COVID-19 vaccine: 'కరోనాపై జరుగుతున్న యుద్ధంలో.. విజయం సాధించడానికి ఏకైక మార్గం అదెక్కటే'

బుమ్రాపై ప్రశంసల జల్లు
ఇటీవలే టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాపై కర్ట్‌లీ ఆంబ్రోస్ ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. టెస్ట్‌ల్లో 400 వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉందని కొనియాడారు. ఇదే ఫిట్‌నెస్‌తో అతను ఆటలో కొనసాగితే సులువుగా ఈ మార్క్‌ను అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు. బుమ్రా షార్ట్ రనప్‌తో వచ్చిన సమస్యేం లేదని ఆంబ్రోస్ అన్నారు. బుమ్రా ఫిట్‌గా ఉండి తన బౌలింగ్‌ను కొనసాగిస్తే తిరుగుండదన్నారు. ఇక 6 అడుగుల 7 ఇంచుల ఎత్తు ఉండే ఆంబ్రోస్ బౌలర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చారు. అతను వేసే బంతులను ఎదుర్కోవడానికి ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్ సైతం ఇబ్బంది పడేవారు.

ఎక్కువగా హిట్టర్లే
నిజాయికి ప్రస్తుత విండీస్ జట్టులో ఎక్కువగా హిట్టర్లే ఉన్నారు. ఓపెనర్ల నుంచి మొదలుకుని బౌలర్ల వరకు బంతిని బలంగా బాదగలరు. అంబ్రీస్, బ్రావో, గేల్, పావెల్, కింగ్, పూరన్, పోలార్డ్, అల్లెన్, ఛేజ్, హోల్డర్, పాల్, హోప్, రసెల్.. వీరందరి ఆట టీ20లకు మాత్రమే సరిపోతుంది. టెస్ట్, వన్డేలకు వచ్చేసరికి జట్టు విఫలమవుతుంది. ఇటీవలి కాలంలో టీ20ల్లో తప్ప టెస్ట్, వన్డేల్లో సరైన ప్రదర్శన చేసిన సందర్భాలు లేవు. అందుకే కర్ట్‌లీ అంబ్రోస్ తన జట్టుపై ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications
