న్యూజిలాండ్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని సతమణి కిమ్ కాన్వేకు గర్భస్రావం జరిగింది. దాంతో తమ జీవితంలోకి పండంటి బిడ్డను ఆహ్వానించాలనుకున్న కాన్వే-కిమ్ దంపతులకు శోకమే మిగిలింది. ఈ ప్రపంచంలోకి రాకుండానే.. తల్లి గర్భంలోనే పాపాయి మరణించింది. ఈ విషయాన్ని కాన్వే భార్య కిమ్ వాట్సన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది.
'నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడను. కానీ గర్భస్రావం వల్ల నాలాంటి ఎంతో మంది స్త్రీలు ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో నాకు అర్థమైంది. అయినా.. ఈ విషయాన్ని చెప్పడానికి నేనేమీ బాధపడటం లేదు. సిగ్గుపడటమూ లేదు. ఎందుకంటే.. నాలాగే ఏ మహిళకైనా ఇలాంటి విపత్కర పరస్థితి ఎదురైతే.. ఆమె హృదయం ముక్కలైతే తట్టుకునే శక్తి ఉండాలి కదా. అందుకే నా మనసులోని భావాలను ఇలా పంచుకుంటున్నాను.

ఏదో ఒకరోజు మా జీవితాల్లో మళ్లీ అద్భుతం జరుగుతోంది. తను మళ్లీ తిరిగి వస్తే బోలెడంత ప్రేమను కురిపించేందుకు మేం సిద్దంగా ఉంటాము'అని కిమ్ వాట్సన్ భావోద్వేగపూరిత పోస్ట్‌ను పంచుకుంది.
సుదీర్ఘ కాలం ప్రేమించుకున్న కాన్వే- కిమ్ వాట్సన్ నాలుగేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. 2022లో సౌతాఫ్రికా సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు. ఐపీఎల్‌లో కాన్వే సీఎస్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో అతను 15 ఇన్నింగ్స్‌ల్లో 672 పరుగులు చేసి సీఎస్‌కే టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్తానంలో నిలిచాడు.