రాయుడు వచ్చినా రాత మారలేదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలిపించిన చిచ్చర పిడుగులు!

దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాళ్ల సత్తాకు చెన్నై సూపర్ కింగ్స్ దాసోహమైంది.! ఆరెంజ్ ఆర్మీ అనామక ఆటగాళ్ల అద్భుత ఆటతీరుకు బిత్తరపోయింది.! తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు చేతులెత్తేసింది.! దాంతో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది.!
తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనామక ఆటగాళ్లు ప్రియామ్ గార్గ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడు అభిషేక్ శర్మ(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) రాణించాడు. 69 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఈ చిచ్చర పిడుగులు 77 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. చెన్నై బౌలర్లలో చాహర్ రెండు వికెట్లు తీయగా చావ్లా, ఠాకుర్ తలో వికెట్ తీశారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47 నాటౌట్), రవీంద్ర జడేజా(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) రాణించినా ఫలితం లేకపోయింది. ఆఖరి బంతి వరకు ధోనీ క్రీజులో ఉండటం.. భువనేశ్వర్ గాయంతో ఓవర్ పూర్తి చేయకుండానే మైదానం వీడటంతో సన్‌రైజర్స్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. కానీ ఆఖరి ఓవర్ అందుకున్న అబ్ధుల్ సమద్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

చేతులెత్తేసిన టాపార్డర్..
165 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల ధాటికి టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో చెన్నై 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని షేన్ వాట్సన్(1) వికెట్ల మీదకు ఆడుకొని మూల్యం చెల్లించుకోగా.. నటరాజన్ వేసిన ఆరో ఓవర్ ఫస్ట్ బాల్‌కు అంబటి రాయుడు(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అనంతరం అదే ఓవర్‌లో రెండు వరుస బౌండరీలు కొట్టిన డూప్లెసిస్(22) ప్రియమ్ గార్గ్ సూపర్ ఫీల్డింగ్‌కు రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. అనంతరం ధోనీ, జాదవ్ క్రీజులోకి రాగా.. వార్నర్ యువ ప్లేయర్ అబ్దుల్ సమాద్‌కు బంతిని అందించాడు. ఇక తొలి బంతికే కేదార్ జాదవ్(3)ను ఔట్ చేసిన అబ్దుల్ సమాద్ తన తొలి ఐపీఎల్ వికెట్‌ను ఖాతాలో వేసుకొని వార్నర్ నమ్మకాన్ని నిలబెట్టాడు.

ఆదుకున్న ధోనీ, జడేజా..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో ధోనీ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడారు. భువీ వేసిన 17వ ఓవర్‌లో జడేజా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను కీపర్ బెయిర్ స్టో జారవిడిచాడు. దీంతో చెలరేగిన జడేజా హ్యాట్రిక్ బౌండరీలతో 15 పరుగులు పిండుకున్నాడు. నటరాజన్ వేసిన 18 ఓవర్ తొలి బంతిని జడేజా లాంగాఫ్‌లోకి షాట్ ఆడగా మనీష్ పాండే డ్రాప్ చేశాడు.
ఈ అవకాశంతో చెలరేగిన జడేజా భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మరో భారీ షాట్ ఆడిన జడేజా.. అబ్దుల్ సమాద్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

చివర్లో సినిమాను మించిన డ్రామా..
ఇక వచ్చి రావడంతోనే సామ్ కరన్ భారీ సిక్సర్ కొట్టడంతో నట్టూ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. చెన్నై విజయానికి 12 బంతుల్లో 44 పరుగుల కావాల్సిన సమయంలో భువనేశ్వర్ ఓ బంతి వేసి గాయంతో వెనుదిరిగాడు. దీంతో ఖలీల్ అహ్మద్ బంతిని అందుకున్నాడు. తొలి బంతినే అబ్దుల్ సమద్ మిస్ ఫీల్డ్‌తో ధోనీ బౌండరీ తరలించాడు. అనంతరం రెండు క్విక్ డబుల్స్ తీసిన మహీ.. డీ హైడ్రేషన్‌తో ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఓ భారీ సిక్సర్ కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు వచ్చాయి.

అబ్దుల్ సమాద్..
ఇక చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. వార్నర్ బంతిని అబ్దుల్ సమాద్‌కు ఇచ్చాడు. తొలి బంతి వైడ్ కమ్ ఫోర్ రావడంతో హైదరాబాద్ ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆ తర్వాత ధోనీ సిక్స్ కొట్టినా.. మిగతా బంతులను అబ్దుల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ విజయం లాంఛనమైంది. విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రియమ్ గార్గ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications