టీమిండియా టీనేజ్ సెన్సేషన్, రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని బ్యాటింగ్ అద్భుతమని కొనియాడిన మైఖేల్ వాన్.. ఆలస్యం చేయకుండా అతన్ని అంతర్జాతీయ క్రికెట్ ఆడించాలని బీసీసీఐకి సూచించాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యంశీ (17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది.

వైభవ్ బ్యాటింగ్‌కు ఫిదా అయిన మైఖేల్ వాన్.. అతన్ని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని, టీమిండియా అప్‌కమింగ్ ఇంగ్లండ్ టూర్‌కు పంపించాలని సూచించాడు. 'వైభవ్ భారత జట్టులో ఎప్పుడు అరంగేట్రం చేస్తాడు. ఐపీఎల్ సీజన్‌కు ఇది ఆరంభం మాత్రమే అయినప్పటికీ, భారత జట్టు కొన్ని నెలల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ పర్యటనలో వైట్ బాల్ సిరీస్‌లు ఆడనుంది. బీసీసీఐ తెలివిగా ఆలోచిస్తే.. ఆ పర్యటనకు వైభవ్‌ను టీ20 జట్టులో చేర్చాలి. అతనికి తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా.. సీనియర్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అనుభవం కల్పించాలి.
15 ఏళ్ల బాలుడికి ఇంగ్లండ్ పర్యటనకు అనుమతిస్తారో లేదో నాకు తెలియదు. కానీ అతనికి ఆ అనుభవాన్ని ఇవ్వడం భారత క్రికెట్‌కు మంచిది. అతను ఆడటానికి అర్హుడనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. యశస్వి జైస్వాల్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరుతో అతను ఒక సాధారణ ఆటగాడిలా కనిపించాడు. జైస్వాల్ బంతిని అంచనా వేస్తూ ప్రశాంతంగా ఆడటానికి ప్రయత్నించగా.. ఈ కుర్రాడు మాత్రం కేవలం బంతిని మైదానం బయటకు పంపడంపైనే ఫోకస్ పెట్టాడు. అతని ఫియర్‌లెస్ గేమ్ అద్భుతం.'అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు.
యశస్వి జైస్వాల్ సహకారంతోనే తాను మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చానని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. 'నా సహచర ఓపెనర్ జైస్వాల్.. ప్రతి బంతి తర్వాత నాతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు సింగిల్స్ తీయాలో చెబుతుంటాడు. నాకు స్ట్రైకింగ్ ఇస్తూ.. బంతి బ్యాట్‌పైకి వస్తుందని షాట్స్ ఆడమని ప్రోత్సహిస్తాడు.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.