
చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపుతున్నాడు. 41 ఏళ్ల వయసులో అసాధారణ బ్యాటింగ్‌తో పాత ధోనీని తలపిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ధోనీ తన బ్యాటింగ్‌తో ఆ జట్టును ఓడించినంత పని చేశాడు. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. ధోనీ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది గెలిపించినంత పనిచేశాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేయడం.. చివరి మూడు బంతుల్లో 7 పరుగులు డిఫెండ్ చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. 30 బంతుల్లో 63 పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన ధోనీ.. జడేజాతో కలిసి గెలిపించినంత పనిచేశాడు. మొత్తం మూడు సిక్సర్లతో పాటు ఓ బౌండరీ బాదిన ధోనీ.. అభిమానులందర్నీ అలరించాడు.
ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడింది 17 బంతులే అయినా.. 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధోనీ బ్యాటింగ్‌కు రాగానే జియో సినిమా వ్యూస్ రూ. 2 కోట్ల మార్క్‌ను ధాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్‌లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు ఆల్‌టైమ్ రికార్డు.
ధోనీ బ్యాటింగ్ ముందు వరకు కోటి 60 లక్షల వ్యూస్ ఉండగా.. అతను రాగానే మరో 60 లక్షల వ్యూస్ అమాంతం పెరిగాయి. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేసినప్పుడు 1.7 కోట్ల వ్యూస్ రాగా.. ఆర్‌సీబీ, లక్నో మ్యాచ్‌లో 1.8 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజా మ్యాచ్ బ్రేక్ చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్(36 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(38), అశ్విన్(30), హెట్‌మైర్(30 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. డేవాన్ కాన్వే(38 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజింక్యా రహానే(38), ధోనీ(17 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 32 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్, చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలో వికెట్ తీసారు.