బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమి పాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. 50-60 పరుగులు తక్కువ చేశామని, ఈ తప్పిదమే తమ పతనాన్ని శాసించిందని తెలిపాడు.
'నిజాయితీగా చెప్పాలంటే మేం 50-60 పరుగులు తక్కువగా చేశాం. మేం బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. బ్యాటింగ్‌కు చాలా కష్టమైంది. పిచ్ ఏమాత్రం బాలేదు. వీపరీతమైన డ్యూ వచ్చింది. టాస్ ఓడిపోవడం కూడా మా ఓటమిని శాసించింది. టాస్ గెలవడంపై నేను తీవ్ర కసరత్తులు చేశాను. కానీ ఫలితం లేకుండా పోయింది. టాస్ విషయంలో నేను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా.

విపరీతమైన తేమ ఉన్న మైదానంలో లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. గత మ్యాచ్‌లో మాత్రం మేం భారీ స్కోర్ సాధించి భారీ తేడాతో ఘన విజయం సాధించాం. టాస్, పిచ్ కండిషన్స్ మన ఆధినంలో లేనివి. వాటికి ఏం చేయలేం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. గత రెండు మ్యాచ్‌ల్లో మేం సాయశక్తులా పోరాడి 200-210 పరుగులు చేశాం. కానీ ఈ పిచ్ చాలా కఠినంగా ఉంది. 180 పరుగులు కూడా చేయలేకపోయాం. పతీరణ, దేశ్‌పాండే గైర్హాజరీ కూడా సమస్యగా మారింది. డ్యూ ఉన్నప్పుడు బౌలర్లు కూడా ఏం చేయలేరు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లతో 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజింక్యా రహానే(24 బంతుల్లో 5 ఫోర్లతో 29) పర్వాలేదనిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/17), రాహుల్ చాహర్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్ స్టో(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 46), రీలీ రోసౌ(23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించగా.. శశాంక్ సింగ్(25 నాటౌట్), సామ్ కరణ్(26 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. చెన్నై బౌలర్లలో శివమ్ దూబే, రిచర్డ్ గ్లీసన్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.