
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌తోనే చెన్నై సారథ్య బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో చెన్నై ఓటమిపాలైంది. ఇక తాజా మ్యాచ్‌లో టాస్ గెలవడంతో జడేజా సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మొత్తానికి టాస్ గెలిచానంటూ ఆనందపడ్డాడు.
మరో ఆలోచన లేకుండా వెంటనే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఎలాంటి కఠిన పరిస్థితులనైనా తాము సాధారణంగా భావిస్తామని చెప్పిన జడేజా... ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా తేరుకోవాలో అనుభవం కలిగిన తమ జట్టుకు బాగా తెలుసన్నాడు. తాము ప్రతీ ప్లేయర్‌కు అండగా ఉంటామని చెప్పాడు. జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని తుషార్ స్థానంలో క్రిస్ జోర్డాన్ ఆడుతున్నాడని చెప్పాడు.

ఇక టాస్ ఓడిన మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ.. వికెట్ బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుందని, భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచుతామని చెప్పాడు. చివరి మ్యాచ్ గురించి పెద్దగా ఆలోచించడం లేదన్న మయాంక్.. ప్రస్తుత మ్యాచ్‌పైనే పూర్తిస్థాయి దృష్టి సారించామని చెప్పాడు. జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయని, హర్‌ప్రీత్ బ్రార్ స్థానంలో వైభవ్, రాజ్ భావ స్థానంలో జితేష్ జట్టులోకి వచ్చారని మయాంక్ చెప్పుకొచ్చాడు. వైభవ్ రెండు వైపుల బంతిని స్వింగ్ చేయగలడని, కీపర్ జితేశ్ మిడిలార్డ్‌లో బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, షారూఖ్ ఖాన్, జితేశ్ శర్మ, ఓడియన్ స్మిత్, ఆర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, డ్వేన్ ప్రిటోరియస్, ముఖేశ్ చౌదరి