ఐపీఎల్ 2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లతో 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజింక్యా రహానే(24 బంతుల్లో 5 ఫోర్లతో 29) పర్వాలేదనిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/17), రాహుల్ చాహర్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్ స్టో(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 46), రీలీ రోసౌ(23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించగా.. శశాంక్ సింగ్(25 నాటౌట్), సామ్ కరణ్(26 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. చెన్నై బౌలర్లలో శివమ్ దూబే, రిచర్డ్ గ్లీసన్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
శుభారంభం లేకున్నా..
163 పరుగుల సాధారణ లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(13)ను అరంగేట్ర ప్లేయర్ రిచర్డ్ గ్లీసన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రిలీ రోసౌతో కలిసి మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. హాఫ్ సెంచరీకి చేరువైన జానీ బెయిర్ స్టోను శివమ్ దూబే కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే రీలీ రోసౌను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్, సామ్ కరణ్ ఆచితూచి ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపారు.
పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా.. ముస్తాఫిజుర్ వేసిన 17వ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్‌లో బౌండరీ బాదగా.. శశాంక్ సింగ్ క్విక్ డబుల్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.