CSK vs MI: పరువు కోసం చెన్నై పాకులాట.. ప్లే ఆఫ్స్ పై ముంబై గురి.. ఈ మ్యాచ్‌కు రోహిత్ దూరం!

షార్జా : ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవడమే లక్ష్యంగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం షార్జా వేదికగా జరిగే లీగ్ మ్యాచ్ లో తమ చిరకాలప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే)తో పోటీపడనుంది. వరుస పరాజయాలకు తోడు కీలక ప్లేయర్ల సేవలను కోల్పోయి నిరాశలో ఉన్న సీఎస్‌కే మాత్రం ముంబైకి మరోసారి షాకివ్వాలని చూస్తోంది.
ఇప్పటిదాకా పది మ్యాచ్ లాడి ఆరు పాయింట్లు సాధించిన చెన్నై.. మిగిలిన నాలుగింటిలో గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ దక్కే సూచనల్లేవు. కానీ ఇప్పటికే తమకు ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన ఈ సీజన్ ను అదిరిపోయే ఫినిషింగ్ టచ్ తో ముగించాలని భావిస్తోంది. మరోవైపు సీజన్ ప్రారంభమ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు టేబుల్ టాపర్‌గా నిలవాలని ముంబై పట్టుదలతో ఉంది. మరి ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి.

యువ ఆటగాళ్లతో చెన్నై..
ఊహించని విధంగా ఫ్లాఫ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ కనీసం పరువునిలుపుకోవాలని భావిస్తోంది. ఇన్నాళ్లూ బెంచ్‌కు పరిమితమైన పలువురు సీఎస్‌కే యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో అవకాశం దొరకవచ్చు. రాజస్తాన్ తో మ్యాచ్ తర్వాత కేదార్ జాదవ్‌పై మరిన్నివిమర్శలు రాగా.. రుతురాజ్ గైక్వాడ్ , ఎన్ జగదీశన్‌లో ఒకరు ఆప్లేస్ ను భర్తీ చేయనున్నారు.
డుప్లెసిస్ ,రాయుడు అడపాదడపా రాణిస్తున్నా వారికి సహకారం దొరకడం లేదు. బౌలింగ్ లోనూ చాలా ఇబ్బందులు పడుతున్న చెన్నై.. ముంబైని ఓడిస్తే సంచలనమే అవుతుంది. ధోనీ బ్యాటింగ్‌లో కూడా మునపటి మెరుపుల్లేవ్. గత సీజన్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన ఇమ్రాన్ తాహిర్ ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్‌లోనైనా అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. స్థాయికి తగ్గ ప్రదర్శన రాణిస్తేనే చెన్నైకి ముంబైపై గెలిచే అవకాశం ఉంది.

బలంగా ముంబై..
ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలంగా ఉంది. వరుసగా ఐదు విజయాల తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో డబుల్ సూపర్ ఓవర్‌లో ఓడింది. ఈ మ్యాచ్‌లో చెన్నైకు చెక్ పెట్టి గత ఓటమికి బదులు తీర్చు కోవడంతోపాటు.. తిరిగి టచ్ లోకి రావాలని రోహిత్ సేన భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్న ముంబై అంచనాలకు తగ్గట్లు చెలరేగితే చెన్నైకి కష్టాలు తప్పవు. అయితే గత మ్యాచ్‌లో గాయపడ్డ రోహిత్ శర్మ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అతను పూర్తిగా కోలుకోలేదనే తెలుస్తోంది. అదే జరిగితే క్రిస్‌లీన్ ఆడటం ఖాయం. అప్పుడు పొలార్డ్ కెప్టెన్సీ వహించవచ్చు.

పిచ్ రిపోర్ట్:
షార్జా పిచ్ చిన్నమైదానం. బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు ఆస్కారం ఉంది. కానీ గత కొన్ని మ్యాచ్‌లుగా పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. పైగా లీగ్‌లో సెకండాఫ్ చేజింగ్ జట్లే విజయాన్నందుకుంటున్నాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ మైదానంలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ముంబై 34 పరుగులతో హైదరాబాద్‌ను ఓడించింది. రెండు మ్యాచ్‌లు ఆడిన చెన్నై రెండింటిలోనూ ఓడిపోయింది.

ముఖా ముఖి
ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడగా ముంబై 17 సార్లు, చెన్నై 12 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్‌ల్లో మాత్రం నాలుగింటిలో ముంబై గెలవగా.. ఒక్కదానిలోనే ముంబై విజయం సాధించింది. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఫైనల్‌తో సహా నాలుగు మ్యాచ్‌లు జరగ్గా నాలుగింటిలో ముంబైనే గెలవడం విశేషం.

తుది జట్లు (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, ఎన్ జగదీషన్/రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, దీపక్ చాహర్, షార్ధుల్ ఠాకుర్, కర్ణ్ శర్మ/కేఎమ్ అసిఫ్, జోష్ హజల్‌వుడ్/ఇమ్రాన్ తాహిర్
ముంబై ఇండియన్స్: క్వింటన్ డికాక్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్)/క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్/సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్/ధావన్ కులకర్ణి, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications