
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో అంపైర్ల ఘోర తప్పిదాలు పునరావృతమవుతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అంపైర్ తప్పిదానికి తోడు నిర్వాహకులు అలసత్వం చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర నష్టం చేకూర్చింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవాన్ కాన్వే(0) ఎల్బీ విషయంలో అంపైర్ తప్పిదం చేయగా.. పవర్ కట్ కారణంగా రివ్యూ తీసుకునే అవకాశం లేకపోయింది. దాంతో తొలి ఓవర్‌లోనే కాన్వే పెవిలియన్ చేరగా.. చెన్నై ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
డానియల్ సామ్స్(3/16), కుమార్ కార్తీకేయ(2/22), రిలే మెరెడిత్(2/27) బంతితో చెలరేగడంతో చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. మహేంద్ర సింగ్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై పరువు దక్కించుకుంది. తొలి ఓవర్‌లోనే డేవాన్ కాన్వే(0), మోయిన్ అలీ(0) ఔటవ్వగా.. రెండో ఓవర్‌లో రాబిన్ ఊతప్ప(0) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ కొద్దిసేపటికే రుతురాజ్ గైక్వాడ్(7)ను డానియల్ సామ్స్ క్యాచ్ ఔట్ చేశాడు. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన అంబటి రాయుడి(10)ని రిలే మెరిడిత్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలోనే చెన్నై 5 కీలక వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే(10), డ్వేన్ బ్రావో(12) కూడా విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ధోనీ ఒంటరిపోరాటం చేశాడు. చివర్లో సిమ్రన్ జిత్, మహీశ్ తీక్షణ ఔటవ్వగా.. ముఖేశ్ చౌదరి రనౌటయ్యాడు. దాంతో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది.