ఐపీఎల్ 2025 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఘనంగా ప్రారంభించింది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన సీఎస్‌కే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ముంబై ఇండియన్స్ తమకు అలవాటైన రీతిలోనే మరోసారి తొలి మ్యాచ్‌ను దేవుడికి ఇచ్చేసింది. గత 13 ఏళ్లుగా ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31)టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో దీపక్ చాహర్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్(4/14) నాలుగు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్(3/29) మూడు వికెట్లు పడగొట్టాడు. నాథన్ ఎల్లిస్, రవిచంద్రన్ అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సీఎస్‌కే 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53), రచిన్ రవీంద్ర(44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో విజ్ఞేష్ పుతుర్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, విల్ జాక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.