
మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ముంబై ఇండియన్స్ తాత్కలిక సారథి కీరన్ పొలార్డ్ వికెట్. 157 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు మంచి శుభారంభం అందకపోయినా.. వికెట్లు వరుసగా కోల్పోయినా పొలార్డ్ ఉన్నాడనే భరోసా అటు ముంబై అభిమానులకు.. భయం ఇటు చెన్నై అభిమానులకు ఉంది. ఇక 13 ఓవర్ల ముగిసే సరికి ముంబై 4 వికెట్లకు 87 రన్స్ చేసింది. క్రీజులో హాఫ్ సెంచరీ హీరో సౌరభ్ తివారి(40 బంతుల్లో 50 నాటౌట్)తో పాటు కీరన్ పొలార్డ్ ఉన్నాడు. ముంబై ఇంకా 42 బంతుల్లో 70 పరుగులు చేయాలి. క్రీజులో విధ్వంసకర పొలార్డ్ ఉండటంతో ముంబై విజయం లాంఛనమేనని అంతా భావించారు. పైగా ఫస్టాఫ్‌లో ఇదే పొలార్డ్ ఒంటి చేత్తో చెన్నై ఓడించాడు. ఈ చేధు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ధోనీ.. వ్యూహాత్మకంగా జోష్ హజెల్ వుడ్‌ను రంగంలోకి దింపాడు. ఈ ఆస్ట్రేలియా బౌలర్ బౌలింగ్‌లో తడబడిన పొలార్డ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ వెంటనే కృనాల్ పాండ్యా రనౌటవ్వడంతో ముంబై కష్టాలు రెట్టింపు అవ్వగా.. చెన్నై పని సులువైంది.

రుతురాజ్ క్యాచ్ డ్రాప్
1/1, 2/2, 7/3 మూడు ఓవర్లు ముగిసే సరికి చెన్నై ఆట సాగిన తీరిది. డుప్లెసిస్, మొయిన్ అలీ డౌకటవ్వగా.. అంబటి రాయుడు కూడా ఖాతా తెరవకుండానే రిటైర్ట్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ ధోనీ, వైస్ కెప్టెన్ రైనా సింగిల్ డిజిట్స్‌కే ఔటయ్యారు. దాంతో చెన్నై 24 పరుగులకే ఐదుగురు బ్యాట్స్‌మెన్ సేవలను కోల్పోయింది. అంతలా ముంబై బౌలర్లు చెలరేగారు. అయితే ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో రుతురాజ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడే ముంబై ఘోర తప్పిదం చేసింది. రాహుల్ చాహర్ వేసిన 9వ ఓవర్‌లో గైక్వాడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కీపర్ డికాక్ నేలపాలు చేశాడు. అప్పుడు రుతురాజ్ వ్యక్తిగత స్కోర్ 19 పరుగులు మాత్రమే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అతను ముంబై బౌలర్లను చెడుగుడు ఆడాడు. వీరోచిత హాఫ్ సెంచరీతో చెన్నైకి చిరస్మరణీయ విజయాన్నందించాడు. రుతురాజ్ ఇచ్చిన క్యాచ్‌ను డికాక్ పట్టి ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్ 100 పరుగుల లోపే ముగిసేది.

చేతులెత్తేసిన ముంబై బౌలర్లు..
ఆరంభంలో తమ బౌలింగ్‌తో వణికించిన ముంబై బౌలర్లు స్లాగ్ ఓవర్లలో తేలిపోయారు. తొలి 10 ఓవర్ల ముగిసే సరికి 4 వికెట్లకు 44 పరుగులే చేసిన చెన్నై.. మరో 10 ఓవర్లలో 112 పరుగులు చేసింది. ఇక చివరి మూడు ఓవర్లలో 10, 24, 15తో 49 పరుగులు చేసింది. తన తొలి రెండు ఓవర్లలో బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్.. చివరి రెండు ఓవర్లలో మాత్రం డ్వేన్ బ్రావో ధాటికి తేలిపోయాడు. అతను వేసిన 19వ ఓవర్లో బ్రావో మూడు సిక్సర్లు బాదాడు. స్లాగ్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న బుమ్రా కూడా చేతులెత్తేసాడు. నాలుగు ఓవర్లలో 33 రన్స్ ఇచ్చాడు. కృనాల్ పాండ్యా రెండు ఓవర్లలో 27 రన్స్ ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో కృనాల్ బౌలింగ్ చెన్నై బ్యాట్స్‌మన్ ఊపిరి పోసింది. ఆడమ్ మిల్నే నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులు, రాహుల్ చాహర్ 22 రన్స్ ఇచ్చారు. మిగతా అంతా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యారు. చివరి ఓవర్లలో ముంబై బౌలర్లు పొదుగా బౌలింగ్ చేసి ఓ 20 పరుగులు కట్టడి చేసినా ఫలితం మరోలా ఉండేది.

చెత్త బ్యాటింగ్
ఇక పేలవ బ్యాటింగ్‌తో సునాయసంగా చేధించాల్సిన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ అందుకోలేకపోయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(17), అన్మోల్ ప్రీత్ సింగ్(16) శుభారంభాన్ని అందివ్వలేకపోయారు. బంగారం లాంటి అవకాశాన్ని అన్మోల్ ప్రీత్ వృథా చేసుకున్నాడు. ఈ ఇద్దరు బౌండరీలతో దూకుడు కనబర్చినా మహీ మార్క్ కెప్టెన్సీతో పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత ఆశలు పెట్టుకున్న ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ (3), ఇషాన్ కిషన్ (11)లు తీవ్రంగా నిరాశపరిచారు. గెలిపిస్తాడనుకున్న పొలార్డ్ (15) కీలక సమయంలో ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో మిల్నే సాయంతో తివారీ కాసేపు చెన్నై బౌలర్లను ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 24 పరుగులు అవసరంకాగా... ముంబై 3 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటింగ్‌లో తివారీ అండగా ఏ ఒక్కరు రాణించినా ఫలితం మరోలా ఉండేది.


Click it and Unblock the Notifications
