లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ అసాధారణ బ్యాటింగ్‌తోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
ఈ సీజన్‌లో సొంతగడ్డపై సీఎస్‌కేకు ఇదే తొలి పరాజయం. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. డ్యూ కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు.

'ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ ఇదో మంచి మ్యాచ్. లక్నో అద్భుత ప్రదర్శన కనబర్చింది. 13-14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతిలోనే ఉంది. కానీ స్టోయినీస్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. డ్యూ కూడా కీలక పాత్ర పోషించింది. తేమ ఎక్కువగా ఉండటంతో మా స్పిన్నర్లను తేలిపోయారు.
అయినా మా పేసర్లతో మ్యాచ్‌పై పట్టు బిగించి చివరి వరకు తీసుకెళ్లాం. ఓటమి అనేది ఆటలో సహజమే. పవర్ ప్లేలోనే రెండో వికెట్ కోల్పోవడంతో జడేజాను నాలుగో స్థానంలో ఆడించాం. పవర్ ప్లే తర్వాతనే శివమ్ దూబేను బ్యాటింగ్ దింపాలనుకున్నాం.
నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్‌పై మేం విధించిన లక్ష్యం సరిపోదు. డ్యూ ఉన్నప్పుడు ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. లక్నో మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసింది.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మోహ్‌సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లరే 213 పరుగులు చేసి గెలుపొందింది.
మార్కస్ స్టోయినీస్(63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), దీపక్ హుడా(6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
చెన్నై బౌలర్లలో మతీష పతీరణ రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీసారు.