చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. చివర్లో అంబటి రాయుడు(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27 నాటౌట్), ధోనీ(3 బంతుల్లో 2 సిక్స్‌లతో 12) మెరుపులు మెరిపించారు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కైల్ మేయర్స్ వేసిన తొలి ఓవర్‌లో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లతో 17 పరుగులు పిండుకుంది.
మేయర్స్ వేసిన మూడో ఓవర్‌లో 10 పరుగులు రాగా.. కృనాల్ వేసిన 4వ ఓవర్‌లో 7 రన్స్ వచ్చాయి. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఐదో ఓవర్‌లో రుతురాజ్ మూడు భారీ సిక్స్‌లు బాది 20 పరుగులు పిండుకున్నాడు. దాంతో చెన్నై.. ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేసింది.

మార్క్ వుడ్ వేసిన 6వ ఓవర్‌లో 19 పరుగులు చేయడంతో పవర్ ప్లేలోనే చెన్నై 79 పరుగులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 110 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని రవి బిష్ణోయ్ ఎట్టకేలకు విడదీసాడు.
రుతురాజ్(57)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చగా.. కాన్వే(47)ను మార్క్ వుడ్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(27) ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔటవ్వగా.. మొయిన్ అలీ(19), బెన్ స్టోక్స్(8), రవీంద్ర జడేజా(3) విఫలమయ్యారు. అంబటి రాయుడితో కలిసి ధోనీ భారీ సిక్స్‌లు బాదడంతో చెన్నై 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.