చెన్నై: పదే పదే నోబాల్స్ వేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ తుషార్ దేశ్ పాండేపై ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కన్నెర్ర చేశాడు. బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తి గట్టి క్లాస్ పీకాడు. బౌలింగ్ వేసే సమయంలో ఫుట్‌వర్క్ ఎలా ఉండాలనే విషయంపై పలు టిప్స్ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన చెన్నై.. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి దిగిన తుషార్ దేశ్ పాండే రెండు వికెట్లు తీసినా ధారళంగా పరుగులిచ్చాడు. నాలుగు ఓవర్లలో ఏడు ఎక్స్‌ట్రాస్ వేసిన తుషార్ దేశ్‌పాండే ఇందులో ఏకంగా మూడు నోబాల్స్ వేసాడు. మొత్తం 45 పరుగులు సమర్పించుకొని కెప్టెన్ ధోనీ ఆగ్రహానికి గురయ్యాడు.

దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌లో రెండు నోబాల్స్, మూడు వైడ్స్‌తో ఏకంగా 11 బంతులేసి 18 రన్స్ ఇచ్చాడు. బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేయడం.. మొయిన్ అలీ తన స్పిన్‌తో లక్నో పతనాన్ని శాసించడంతో చెన్నై ఓటమిని తప్పించుకుంది. లేకుంటే ఈ మ్యాచ్‌లో కూడా చెన్నై చేజార్చుకునేది. మ్యాచ్ ముగిసిన వెంటనే తుషార్ దేశ్‌పాండేకు ధోనీ క్లాసి పీకాడు. నోబాల్స్ సమస్యను అధిగమించేందుకు కొన్ని చిట్కాలు చెప్పాడు. బౌలింగ్ ఎలా చేయాలో కూడా తన రన్నప్‌తో సూచించాడు.
విజయానంతరం మాట్లాడిన ధోనీ పేస బౌలింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు ఇలానే నోబాల్స్, వైడ్లు వేస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. 'మా పేస్ బౌలింగ్ చాలా మెరుగవ్వాలి. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేయడం నేర్చుకోవాలి. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారో కూడా గమనించాలి. ప్రధానంగా నోబాల్స్, వైడ్లు వేయడం మానుకోవాలి. లేదంటే వాళ్లంతా వేరే కెప్టెన్ కింద ఆడుకోవాల్సి ఉంటుంది. ఇది నా వార్నింగ్.' అని చెప్పుకొచ్చాడు.