చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అజింక్యా రహానే కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రహానే సెన్సేషనల్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అచ్చం చేపపిల్లలానే డైవ్ చేసి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌కు డేంజరస్ డేవిడ్ మిల్లర్(26) పెవిలియన్ చేరాడు.
తుషార్ దేశ్‌పాండే వేసిన 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని తుషార్ దేశ్‌పాండే లెగ్ స్టంప్ దిశగా వేయగా.. మిల్లర్ ఫ్లిక్ షాట్ ఆడాడు. దాంతో బంతి గాల్లోకి లేవగా.. డీప్ మిడ్ వికెట్ నుంచి ముందుకు పరుగెత్తుకొచ్చిన రహానే.. సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. రహానే సూపర్ క్యాచ్‌కు మిల్లర్ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు రహానేపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. శివమ్ దూబే( 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(31 బంతుల్లో 3 ఫోర్లతో 37) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. డారిల్ మిచెల్, మతీష పతీరణ తలో వికెట్ పడగొట్టారు.