చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ లలిత్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో లలిత్ యాదవ్ ఒంటి చేత్తో అసాధారణమైన రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. చాలా లోగా వచ్చిన క్యాచ్‌ను సూపర్ డైవ్‌తో పట్టుకున్నాడు.
లలిత్ స్టన్నింగ్ క్యాచ్‌కు చెన్నై వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే నిరాశగా వెనుదిరిగాడు. ఈ అసాధారణమైన క్యాచ్‌కు మైదానంలోని ప్రేక్షకులతో పాటు ఫీల్డ్ అంపైర్ కూడా ఫిదా అయ్యాడు. లలిత్ క్యాచ్ అందుకున్న తర్వాత అంపైర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నెట్టింట వైరల్‌గా మారింది. చెన్నై ఇన్నింగ్స్ సందర్భంగా 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ తొలి బంతిని రహానే స్ట్రైట్‌గా ఆడగా.. బౌలర్ లలిత్ రెప్పపాటు సమయంలో అలర్ట్ అయ్యి బంతిని ఒంటి చేత్తో ఒడిసిపట్టుకున్నాడు. చాలా వేగంగా.. లోగా వచ్చిన బంతిని ఆపేందుకు లలిత్ డైవ్ చేశాడని అంతా అనుకున్నారు. కానీ అసాధారణ రీతితో బంతిని అందుకోవడంతో షాక్‌కు గురయ్యారు. అంపైర్ క్రిస్ గఫానీ ఓ అంటూ నోరెళ్లబెట్టాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ( 9 బంతుల్లో, ఫోర్, 2 సిక్స్‌లతో 20) శివమ్ దూబే(12 బంతుల్లో 3 సిక్స్‌లతో 25), అంబటి రాయుడు (17 బంతుల్లో బౌండరీ, సిక్స్‌తో 23) మెరుపులు మెరిపించారు.
ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. చివర్లో ధోనీ ధాటిగా ఆడటం చెన్నైకి కలిసొచ్చింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
రిలీ రోసౌ(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35), మనీశ్ పాండే(29 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో మతీశ పతీరణ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కింది.