
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా (43 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో షాకు ఇది ఫస్ట్ ఫిఫ్టీ కాగా ఐపీఎల్ కెరీర్‌లో ఐదవది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల అలసత్వంతో షాకు లైఫ్ లభించింది.
దీపక్ చాహర్ వేసిన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్.. పృథ్వీషా బ్యాట్‌కు ఎడ్జ్ కాగా.. వికెట్ కీపర్ ధోనీతో సహా బౌలర్ కూడా అప్పీల్ చేయలేదు. కానీ టీవీ రిప్లేలో బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ మరుసటి బంతులను షా వరుసగా బౌండరీకి తరలించాడు. రెండో ఓవర్‌ను కట్టడిగా వేసిన కరన్ రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడో ఓవర్‌ను చాహర్‌తో కాకుండా జోష్ హజల్‌వుడ్‌తో వేయించిన ధోనీ.. ఢిల్లీ ఓపెనర్ల దూకుడుకు కళ్లెం వేశాడు. కరన్ వేసిన నాలుగో ఓవర్‌లో షా రెండు బౌండరీలు కొట్టి రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత రెండు ఓవర్లలో బౌండరీలు రాకపోవడంతో ఢిల్లీ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 35 రన్స్ చేసింది.
పవర్ ప్లే అనంతరం ధోనీ స్పిన్నర్ చావ్లాను దించగా.. షా రెండు బౌండరీలతో 13 రన్స్ రాబట్టాడు. అనంతరం జడేజా ఫస్ట్ బాల్‌నే ధావన్ భారీ సిక్సర్‌తో బౌండరీల ఖాతా తెరిచాడు. నాలుగో బంతికి మరో బౌండరీ కొట్టడంతో ఈ ఓవర్‌లో కూడా 13 రన్స్ వచ్చాయి. ఇక చావ్లా వేసిన తొమ్మిదో ఓవర్ రెండు, నాలుగో బంతులను బౌండరీలకు తరలించిన షా.. జడేజా వేాసిన ఆ మరుసటి ఓవర్‌లో లెగ్ సైడ్ క్విక్ సింగిల్ తీసి ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత చావ్లా తన వరుస ఓవర్లలో ధావన్, పృథ్వీషాను ఔట్ చేసి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. ధావన్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన చావ్లా.. షాను స్టంపౌట్ చేశాడు.