
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్నందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై 91 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇప్పటికే చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతవ్వగా.. ఈ ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు మాత్రమే సాధించిన ఆ జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిగిన మూడు మ్యాచ్‌ల్లో మూడు గెలిచినా ఇతర జట్ల ఫలితాలతో పాటు నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ విజయంతో చెన్నై.. పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను వెనక్కి నెట్టి 8వ స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. ధోనీ (8 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 21 నాటౌట్) సూపర్ ఫినిష్ అందించాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41), శివమ్ దూబే(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. మిచెల్ మార్ష్(25), రిషభ్ పంత్(21), శార్దూల్ ఠాకూర్(24), డేవిడ్ వార్నర్(19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ మూడు వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు తీసారు. మహీశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు. 10 మ్యాచ్‌ల నిరీక్షణ తర్వాత లభించిన అవకాశాన్ని తెలుగు తేజం కేఎస్ భరత్ చేజార్చుకున్నాడు.