
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ డెవాన్ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. ధోనీ (8 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 21 నాటౌట్) సూపర్ ఫినిష్ అందించాడు. దాంతో ఢిల్లీ ముందు చెన్నై 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41), శివమ్ దూబే(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్‌కు ఓ వికెట్ దక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మరోసారి రికార్డు భాగస్వామ్యంతో మంచి శుభారంభం అందించారు. ఇద్దరు సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో పవర్ ప్లేలో చెన్నై వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఆ తర్వాత డేవాన్ కాన్వే 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రుతురాజ్ సైతం వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. అయితే అతని జోరుకు అన్రిచ్ నోర్జ్ కళ్లెం వేసాడు. 150 కిలో మీటర్ల వేగంతో కూడిన బంతితో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే సైతం మూమెంటమ్ దెబ్బకుండా ధాటిగా ఆడాడు. కాన్వే సైతం భారీ షాట్లతో విరుచుకుపడటంతో చెన్నై స్కోర్ బోర్డు పరుగెత్తింది. సెంచరీకి చేరువైన డేవాన్ కాన్వేను ఖలీల్ అహ్మద్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మిచెల్ మార్ష్.. శివమ్ దూబే(32)ను ఔట్ చేయగా.. అంబటి రాయుడిని ఖలీల్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ధోనీ ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు. వేగంగా ఆడే క్రమంలో మోయిన్ అలీ(9), రాబిన్ ఊతప్ప(0) ఔటయ్యారు.