
హైదరాబాద్: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. మరో ఐదు రోజుల్లో ఈ మహాఘట్టానికి తెరలేవనుంది. బెంగళూరు వేదికగా శని, ఆది (ఫిబ్రవరి 12,13) వారాల్లో మెగా వేలం జరగనుంది. ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని, ఎంత ఖర్చు పెట్టాలనే పక్కా లెక్కలను తయారు చేసుకుంటున్నాయి. ఇక ఫోర్ టైమ్ టైటిల్ విన్నర్, డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా సత్తా కలిగిన ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై చేరుకొని వ్యూహాలు రచిస్తున్నాడు. మెగా వేలం కార్యక్రమానికి కూడా హాజరుకానున్నాడు.
అయితే వెస్టిండీస్ పేసర్ రోమారియో షెఫేర్డ్‌ను తీసుకునేందుకు చెన్నై ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.75 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న షెఫేర్డ్.. టీమ్ బడ్జెట్‌కు సరిగ్గా సరిపోతాడని, ఇటీవల అతని ఫామ్ కూడా మెరుగ్గా ఉందని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావిస్తోందంట. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌ల్లో షెఫెర్డ్.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. ఓ మ్యాచ్‌లో 28 బంతుల్లో 44 పరుగులు చేశాడు. బ్యాట్స్‌మన్ తరహాలో చెలరేగాడు.
చెన్నైకే చెందిన మోయిన్ అలీ సైతం షెఫెర్డ్ ప్రదర్శన పట్ల ఫిదా అయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని తీసుకునేందుకు చెన్నై ప్రణాళికలు రచిస్తోంది. రూ. 75 లక్షల నుంచి కోటిన్నర ధరలో అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సీఎస్‌కే భావిస్తోంది. భారత్‌తో జరుగుతున్న వన్డే, టీ20 సిరీస్‌ల్లో షెఫెర్డ్ సత్తా చాటితే మాత్రం భారీ ధర పలికే చాన్సుంది. ఇప్పటి వరకు 10 వన్డేలు, 14 టీ20 ఆడిన ఫెఫెర్డ్.. 20 వికెట్లు పడగొట్టాడు. ఇక రిటెన్షన్ ప్రక్రియలో చెన్నై.. రవీంద్ర జడేజా(రూ.16 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ.12 కోట్లు), మోయిన్ అలీ(రూ.8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్(రూ.6 కోట్లు) నలుగురిని అంటిపెట్టుకొని రూ.42 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్టు పర్స్ మనీలో ఇంకా రూ.48 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే చెన్నై యువ ఆటగాళ్లపై కన్నేసింది. వీలైనంత తక్కువ ధరకు యువ ప్లేయర్లను ఎంచుకొని ధోనీ పర్యవేక్షణలో తమకు అనుగుణంగా సిద్దం చేసుకోవాలని భావిస్తోంది.