చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నర్ క్రిష్ శ్రీకాంత్ కుమారుడైన అనిరుధ శ్రీకాంత్.. తమిళ బిగ్ బాస్ బ్యూటీ సంయుక్తను పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సంయుక్త.. 2007లో మిస్ చెన్నైగా నిలిచింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 4తో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ తర్వాత ఆమెకు పలు చిత్రాల్లో నటించే అవకాశం లభించింది. తమిళ స్టార్ విజయ్ దళపతికి చెందిన వారిసు చిత్రంతో పాటు కాఫీ విత్ లవ్, తుగ్లక్ దర్బార్, మై డియర్ భూతం వంటి చిత్రాల్లో నటించింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ప్రోడ్యూసర్ అయిన కార్తీక్ శంకర్‌ను సంయుక్త ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ వీరి కాపురం ఎక్కువ రోజులు కొనసాగలేదు.

ప్రస్తుతం ఈ ఇద్దరూ విడాకులు తీసుకొని విడి విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. తన కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటున్న సంయుక్త.. సీఎస్‌కే మాజీ క్రికెటర్ శ్రీకాంత్ అనిరుధ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యిందని, త్వరలోనే పెళ్లి కూడా కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
దీపావళి పండుగను ఈ ఇద్దరూ కలిసి జరుపుకోవడం, ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ఈ రిలేషన్‌షిప్ గురించి సంయుక్తను మీడియా ప్రశ్నించగా.. ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. 'అంతా ఇంటర్నెట్‌లో ఉంది. మా మధ్య ఏది ఉండాలో అదే ఉంది'అని బదులిచ్చింది.
1983 ప్రపంచకప్ విన్నర్ అయిన క్రిష్ శ్రీకాంత్ తనయుడే అనిరుధ శ్రీకాంత్. టాపార్డర్ బ్యాటర్ అయిన అనిరుధ చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. అరంగేట్ర ఐపీఎల్ సీజన్ నుంచి 2013 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన అనిరుధ శ్రీకాంత్.. ఐపీఎల్ 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు.
మొత్తం 20 మ్యాచ్‌లు ఆడి 136 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. 2012లో అనిరుధ శ్రీకాంత్.. ఆర్తి వెంకటేష్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్నాళ్లకే ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఒంటరిగానే ఉంటున్న అనిరుధ.. సంయుక్తను రెండో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.