
న్యూఢిల్లీ: చెన్నైకి చెందిన ఓ వ్యాపారి తన వద్ద రూ.4 కోట్లు అప్పుగా తీసుకొని ఇవ్వడం లేదని భారత వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. తన అప్పును చెల్లించాలని ఎన్ని సార్లు అడిగినా దాటవేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ వ్యవహారంలో సదరు వ్యాపారవేత్త ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హర్భజన్‌కు జి.మహేష్ అనే బిజినెస్ మ్యాన్ 2015లో పరిచయం అయ్యాడు.
ఆ సమయంలో హర్భజన్ దగ్గర్నుంచి రూ. 4 కోట్లు అప్పుగా తీసుకున్న మహేష్.. ఎన్నిసార్లు అడిగినా తర్వాత ఇస్తానంటూ దాటవేసుకుంటూ వచ్చాడు. గత నెల రూ.25 లక్షల చెక్‌ను భజ్జీకి ఇచ్చాడు. కానీ అతని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో అది బౌన్స్ అయ్యింది. దీంతో తన అప్పు రాబట్టుకునేందుకు ఇటీవలే చెన్నై వెళ్లిన హర్భజన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసు విచారణకు సంబంధించిన పిటీషన్ నీలంకరై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు విశ్వేశ్వరయ్య ముందుకు వెళ్లింది. ఇప్పటికే ఏసీపీ మహేష్‌కు సమన్లు జారీ చేశారు. దీంతో మహేష్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. తలంబూర్‌లోని స్థిరాస్తిని సెక్యూరిటీగా ఉంచి హర్భజన్ దగ్గర్నుంచి అప్పు తీసుకున్నానని మహేష్ తన అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ భజ్జీకి మొత్తం బకాయిలను చెల్లించానని కూడా చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు హర్భజన్ దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ వెటరన్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ఈ విపత్కర కాలంలో కుటుంబంతో ఉండటం ముఖ్యమనిపించిందని, కొంత ప్రైవసీ కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం కావడం వల్ల హర్భజన్ రూ.2 కోట్లు నష్టపోనున్నాడు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ భజ్జీని రూ. 2 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
IPL 2020 టైటిల్ గెలిచేది ఆ జట్టే.. పరుగుల విధ్వంసం సృష్టించేది అతనే: బ్రెట్ లీ
https://telugu.mykhel.com/cricket/brett-lee-picks-ms-dhoni-led-csk-as-the-winner-of-the-ipl-2020-030192.html