
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలోనే సక్సెఫుల్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో అత్యంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. సీజన్‌కు ముందే స్టార్ ఆటగాళ్లైన సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ దూరం కాగా.. ఆ తర్వాత కరోనా కొరల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అయింది. తీరా లీగ్ ప్రారంభమయ్యాక వరుస పరాజయాలతో చతికిలపడింది. ఓటములకు చెక్ పెడుతూ విజయాన్నందుకున్నా.. ఆ వెంటనే మరో పరాజయంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఎన్నడూ లేనిది ధోనీ వ్యూహాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. గెలిచే మ్యాచ్‌లో ఆ జట్టు ఓడుతుంది.
ఈ నేపథ్యంలోనే ఆ జట్టు స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ట్విటర్ వేదికగా చేసిన పని ఆ జట్టులోని గందరగోళ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆడిన లుంగి ఎంగిడి.. ఒకే ఓవర్‌లో 30 పరుగులిచ్చుకొని వేటుకు గురయ్యాడు. అయితే మేనేజ్‌మెంట్ తనను పక్కకు పెట్టడంపై అసంతృప్తిగా ఉన్న లుంగి ఎంగిడి సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వెల్లగక్కాడు. 'నా నుంచి చాలా చెడ్డ విషయాలను కోరుకుంటున్నారు'అని అర్థం కానీ పరోక్షవ్యాఖ్యలతో ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై స్పందించిన అభిమానులు సానుకూల దృక్పథంతో ఉండమని, త్వరలోనే అవకాశం వస్తుందని ఎంగిడికి సూచించారు. అయితే ఓ ట్విటర్ యూజర్ మాత్రం 'మీరు మంచి ఐపీఎల్ జట్టులో ఆడేందుకు అర్హులు బ్రో'అని కామెంట్ చేశాడు. దీన్ని లుంగి ఎంగిడి లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చెన్నై శిభిరంలో ఏదో తేడాగా ఉందనే సంకేతాలను ఇస్తుంది.
అయితే ఓవర్‌సీస్ ఆటగాళ్ల నిబంధన కారణంగానే లుంగి ఎంగిడికి అవకాశం దక్కడం లేదు. ఫాఫ్ డూప్లెసిస్, షేన్ వాట్సన్ అద్భుతంగా రాణిస్తుండటం.. డ్వేన్ బ్రావో తుది జట్టులోకి రావడం.. సామ్ కరన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతుండటంతో ఎంగిడి బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో రెండే గెలిచిన సీఎస్‌కే పాయింట్స్ టేబుల్లో 6 స్థానంలో ఉంది.