
నలుగురికే చాన్స్..
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి. నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలతో ఫ్రాంచైజీల కోర్ టీమ్ చెల్లాచెదురు కానుంది. గత కొన్నేళ్లుగా జట్టులో ఉంటూ ఒకరికొకరు మమేకమైన ఆటగాళ్లంతా చెల్లా చెదురు కానున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎవరిని తీసుకోవాలనేది కూడా ఫ్రాంచైజీలకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ధోనీ రిటైన్ చేసుకుంటారా?
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడా? లేక ఆటకు అల్విదా ప్రకటించి మెంటార్ సింగ్ అవుతాడా? అనేది మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మారింది. గత రెండేళ్లుగా అతని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ గెలిచిన అనంతరమే మహీ ఘనంగా ఆటకు వీడ్కోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ అలా ఏం జరగలేదు. పైగా ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా మహీ మాట్లాడుతూ.. తనకు చెన్నై అభిమానుల మధ్య ఆటకు వీడ్కోలు పలకాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టాడు. ఆ వెంటనే తాను వచ్చే సీజన్ ఆడేది బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉందని తెలిపాడు. దాంతో ధోనీ ఆడుతాడా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. మరోవైపు చెన్నై ఫ్రాంచైజీ మాత్రం ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడుతాడని, రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో అతనే మొదటి వాడని అధికారికంగానే ప్రకటించింది. ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

రవీంద్ర జడేజా..
ఒకవేళ ధోనీని చెన్నై రిటైన్ చేసుకుంటే రెండో ఆటగాడిగా రవీంద్ర జడేజాను ఎంచుకోనుంది. జట్టులో కీలక ఆల్‌రౌండర్ అయిన జడేజా చెన్నై ఫ్రాంచైజీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయగల జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌కు విలువైన ఆటగాడు. అతన్ని సెకండ్ స్లాబ్ ప్లేయర్‌గా రూ. 12 కోట్ల ధరకు తీసుకోనుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో జడేజాకు రూ.7 కోట్ల వేతనం మాత్రమే అందింది. ఈసారి అదనంగా మరో రూ.5 కోట్లు అందుకోనున్నాడు. ఐపీఎల్ 2021 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలవడంలో రవీంద్ర జడేజాది కీలక పాత్ర. 13 వికెట్లతో పాటు 227 పరుగులు చేశాడు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో ధాటైన బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు.

ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్..
ఇక మూడో స్లాబ్ ప్లేయర్‌గా ఫాఫ్ డుప్లెసిస్, నాలుగో స్లాబ్ ప్లేయర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌లను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటున్నా చెన్నై ఒక్కరినే ఎంచుకునే చాన్సుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 633 రన్స్ చేసిన డూప్లెసిస్ జట్టు తరఫున సెకండ్ హయ్యెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక నాలుగో స్లాబ్ ప్లేయర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌కు రూ.6 కోట్ల వేతనం అందనుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో 635 రన్స్‌తో రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సీఎస్‌కే భవిష్యత్తు ప్లేయర్‌గా రుతురాజ్‌ను తీర్చిదిద్దే చాన్సుంది. ఇక మెగా వేలం కారణంగా సీఎస్‌కే డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు, సామ్ కరన్, మొయిన్ అలీ, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా వంటి ఆటగాళ్లను కోల్పోనుంది.


Click it and Unblock the Notifications












