
న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వైస్ కెప్టెన్ సురేశ్ రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ స్థానంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం డేవిడ్ మలన్‌ను తీసుకోవాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తుందని పెద్దు ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ గాలి వార్తలేనని ఆ జట్టు సీఈవో కేఎస్ విశ్వనాథన్ స్పష్టం చేశారు.
ఏఎన్‌ఐ వార్త సంస్థతో మాట్లాడుతూ.. తమ ఫారిన్ ప్లేయర్స్ కోటా ఇప్పటికే ఫుల్‌గా ఉందని, అలాంటప్పుడు మరో విదేశీ ఆటగాడిని ఎలా తీసుకుంటామని ఆయన ప్రశ్నించారు. 'నిజంగా ఇది నాకు కూడా వార్తే. ఎందుకంటే మా విదేశీ ఆటగాళ్ల కోటా ఫుల్‌గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఫారిన్ ప్లేయర్‌ను ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు.'అన్నాడు.
ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టు గరిష్టంగా 8 మంది విదేశీ ఆటగాళ్లు, 17 మంది భారత ఆటగాళ్లను మాత్రమే కలిగి ఉండాలి. ప్రస్తుత సీజన్‌కు మొత్తం సంఖ్య 24కు మించరాదు. సీఎస్‌కే ఇప్పటికే షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్, జోష్ హజల్ వుడ్, మిచెల్ సాంట్నర్, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డూప్లెసిస్, సామ్ కరణ్‌లను కలిగి ఉంది. నిబంధనల ప్రకారం వారికి విదేశీ ఆటగాడిని తీసుకునే అవకాశమే లేదు.
ఇక కరోనా నుంచి కోలుకున్న దీపక్ చాహర్ శుక్రవారం నుంచి జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయనున్నాడని విశ్వనాథన్ తెలిపారు. బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం చాహర్ అన్నీ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఇక కరోనా బారిన పడిన మరో ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఇంకా క్వారంటైన్‌లో ఉన్నాడు. అతని 14 రోజుల ఐసోలేషన్ ఇంకా పూర్తికాలేదు. పూర్తయిన వెంటనే 24 గంటల్లో అతనికి రెండు సార్లు నిర్వహించే కరోనా పరీక్షల్లో నెగటీవ్ వస్తే జట్టుతో ప్రాక్టీస్‌కు అనుమతించనున్నారు. ఇక చెన్నై తన తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో సెప్టెంబర్ 19న ఆడనున్న విషయం తెలిసిందే.