లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై.. ఆ తర్వాత సునాయసంగా గెలిచే రెండు మ్యాచ్‌ల్లో ఓడి నాలుగో స్థానానికి పరిమితమైంది.
ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపొంది మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యంతో చెన్నై 200 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దాంతో చెన్నై మేనేజ్‌మెంట్ బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే అవకాశం ఉంది.

పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న మహీశ్ తీక్షణపై వేటు వేసే అవకాశం ఉంది. తీక్షణ కోసం పక్కనపెట్టిన మిచెల్ సాంట్నర్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవచ్చు. గత 6 మ్యాచ్‌ల్లో తీక్షణ ఐదు వికెట్లు మాత్రమే తీసి ధారళంగా పరుగులిచ్చాడు. అయితే లక్నో మైదానం పిచ్ స్లోగా ఉండటంతో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. స్లో వికెట్ అయితే మాత్రం తీక్షణ తుది జట్టులోనే ఉండనున్నాడు. సాంట్నర్ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా బరిలోకి దిగుతాడు.
మొకాలి గాయంతో జట్టుకు దూరమైన బెన్ స్టోక్స్ రీఎంట్రీపై స్పష్టత లేదు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే సూపర్ ఫామ్‌లో ఉండగా.. అజింక్యా రహానే దుమ్మురేపుతున్నాడు. శివమ్ దూబేకు తిరుగులేదు. అంబటి రాయుడు భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా.. ధోనీ, జడేజా తమదైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్నారు. మొయిన్ అలీ సైతం పర్వాలేదనిపిస్తున్నాడు.
బౌలింగ్‌లో మహీశా పతీరణ, తుషార్ దేశ్‌పాండే సత్తా చాటుతున్నారు. ఆకాశ్ సింగ్ కూడా సూపర్ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే గత మ్యాచ్‌లో తుషార్ దేశ్ పాండే ధారళంగా పరుగులు ఇచ్చాడు.
సీఎస్‌కే తుది జట్టు(అంచనా)
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, మిచెల్ సాంట్నర్/ మహీశ్ తీక్షణ, మహీశ్ పతీరణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్.