ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) తనదైన శైలిలో దుమ్మురేపింది. ఫ్యాన్సీ ఆటగాళ్ల జోలి పోకుండా.. కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టకుండా తమకు కావాల్సిన ఆటగాళ్లనే ఆచితూచి కొనుగోలు చేసింది. టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మార్క్ సెలెక్షన్ వేలంలో ప్రతిబింబించింది.
మరోసారి అనుభవానికే పెద్ద పీట వేస్తూ.. సీనియర్ ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. అంతేకాకుండా జట్టు భవిష్యత్తు కోసం అనామక ఆటగాళ్లపై కూడా ఖర్చు పెట్టింది. తెలుగు తేజం షేక్ రషీద్‌తో పాటు అనేక మంది కుర్రాళ్లను తీసుకుంది.

అశ్విన్‌కే రూ. 9.75 కోట్లు..
వేలానికి ముందే తమ ప్రధాన ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మతీష పతీరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీలను అంటిపెట్టుకుంది. తమ పాత ఆటగాళ్లు అయిన డేవన్ కాన్వే, రచిన్ రవీంద్రలను తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేసింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంది.
అతని కోసమే అత్యధికంగా రూ.9.75 కోట్లు ఖర్చు చేసింది. మరో అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కోసం రూ. 10 కోట్లు వెచ్చింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్‌ను తక్కువ ధరకే దక్కించుకుంది. భారత పేసర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరీలను కొనుగోలు చేసింది. బ్యాటర్లలో వెటరన్ ప్లేయర్ దీపక్ హుడాను కొనుగోలు చేసింది. వేలంలో మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి 25 మందితో జట్టును భర్తీ చేసింది.
సీఎస్‌కే వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
డేవన్ కాన్వే(రూ. 6.25 కోట్లు), రాహుల్ త్రిపాఠి(రూ. 3.4 కోట్లు), రచిన్ రవీంద్ర(రూ. 4 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్(రూ. 9.75 కోట్లు), ఖలీల్ అహ్మద్(రూ. 4.80 కోట్లు), నూర్ అహ్మద్(రూ. 10 కోట్లు), విజయ్ శంకర్(రూ. 1.2 కోట్లు), సామ్ కరణ్(రూ. 2.4 కోట్లు), షేక్ రషీద్(రూ. 30 లక్షలు), అన్షుల్ కంబోజ్(రూ. 3.4 కోట్లు), ముఖేష్ చౌదరి(రూ. 30 లక్షలు), దీపక్ హు డా(రూ. 1.7 కోట్లు), గుర్జప్‌నీత్ సింగ్(రూ. 2.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ. 2 కోట్లు), జామీ ఓవర్టన్(రూ. 1.5 కోట్లు), కమలేష్ నాగర్‌కోటీ(రూ. 30 లక్షలు), రామకృష్ణ ఘోష్(రూ. 30 లక్షలు), శ్రేయస్ గోపాల్(రూ. 30 లక్షలు), వాన్షి బేడీ(రూ. 55 లక్షలు), ఆండ్రే సిద్దార్థ్(రూ. 30 లక్షలు)
సీఎస్‌కే రిటైన్ లిస్ట్:
రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ. 4 కోట్లు)
సీఎస్‌కే తుది జట్టు(అంచనా): రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, సామ్ కరణ్, ఖలీల్ అహ్మద్, మతీష పతీరణ.