
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి ఇంకా 15 రోజుల గడువే ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడగా.. స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా లీగ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ జట్టు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు స్పష్టం చేశాడు.
మూడు రోజుల క్రితమే భజ్జీ తప్పుకుంటున్నాడని వార్తలు వచ్చినా.. సీఎస్‌కే యాజమాన్యం ఖండించింది. అతని ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడని, త్వరలోనే జట్టు క్యాంప్‌లో చేరుతాడని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న హర్భజన్ తన తల్లి అనారోగ్యం కారణంగా జట్టుతో దుబాయ్‌కు వెళ్లలేదు. చెన్నై వేదికగా నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంప్‌లో కూడా పాల్గొనలేదు.
అయితే జట్టు ప్రణాళిక ప్రకారం అతను గత మంగళవారం(సెప్టెంబర్ 1) యూఏఈలో అడుగుపెట్టాల్సింది. కానీ జట్టులో చోటు చేసుకున్న పరిణామాలు, రైనా లీగ్‌కు దూరమైన నేపథ్యంలో జట్టు ఓనర్ ఎన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలతో భజ్జీ పునరాలోచనలో పడ్డాడని ప్రచారం జరిగింది. కానీ తల్లి అనారోగ్య వల్లే లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక భజ్జీ గైర్హాజరీతో సీఎస్‌కేకు నష్టం జరగనుంది. నెమ్మదైన పిచ్‌ల గల దుబాయ్ మైదానాల్లో స్పిన్నర్లు కీలకం కానున్నారు. అలాంటి పరిస్థితుల్లో హర్భజన్ సింగ్ వంటి సీనియర్ స్పిన్నర్లు జట్టులో ఉండటం అటు జట్టుకు.. ఇటు యువ ఆటగాళ్లకు మంచిదని టీమ్‌మేనజ్‌మెంట్ భావించింది. అయితే హర్భజన్ దూరమైనా... పియూష్ చావ్లా, మిచెల్ సాంట్నర్, కరన్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, సాయి కిషోర్, పార్ట్ టైమ్ స్పిన్నర్ కేదార్ జాదవ్‌తో ఆ జట్టులో స్పిన్నర్లకు కొదవలేదు. హర్భజన్ సింగ్ స్థానంలో మరో ఆటగాడిని కూడా తీసుకునే అవకాశం ఉంది.
ఇక కరోనా కొరల్లో చిక్కుకున్న ఆ జట్టు.. గురువారం నిర్వహించిన పరీక్షా ఫలితాలతో ఊపిరి పీల్చుకుంది. కరోనా సోకిన 13 మంది మినహా అందరికి నెగటీవ్ వచ్చింది. అంతకు ముందు నిర్వహించిన పరీక్షల్లో కూడా నెగటీవ్ రావడంతో ఆ జట్టు శుక్రవారం ప్రాక్టీస్‌కు సిద్దమైంది. 'అంతకు ముందు నెగటీవ్ వచ్చిన సపోర్ట్ స్టాప్, ఆటగాళ్లందరికి నెగటీవ్ వచ్చింది.
ఈ రోజు నుంచి ప్రాక్టీస్ ప్రారంభించబోతున్నాం. కరోనా సోకిన ఆటగాళ్లు, సిబ్బందికి ఐసోలేషన్ పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తాం. అప్పటి వరకు వారి క్వారంటైన్ కొనసాగుతుంది.'అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వానాథన్ మీడియాకు తెలిపారు. ఇటీవలే దుబాయ్‌కు వచ్చిన ఫాఫ్ డూప్లెసిస్, లుంగి ఎంగిడి క్వారంటైన్ కూడా కొనసాగుతుందన్నారు.