
దుబాయ్: వరుస ఓటములతో ఐపీఎల్2020 సీజన్‌లో తంటాలు పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కష్టాలు తీరేందుకు మార్గం సుగుమమైంది. ఆ జట్టు కీలక ఆటగాళ్లు అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌కు వీరిద్దరూ అందుబాటులో ఉంటారని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపారు.
ఐపీఎల్ 2020 ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సాధించిన విజయంలో అంబటి రాయుడు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే మోకాలి కండరం గాయంతో తర్వాతి మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న రాయుడు..నెట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడని, ట్రెయినింగ్‌లో భాగంగా స్ప్రింటింగ్ కూడా చేశాడని కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.

ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కూడా తొడ కండరాల గాయం నుంచి రికవర్ అయ్యాడని, అతను కూడా నెట్స్‌లో ఎలాంటి సమస్య లేకుండా బౌలింగ్ చేశాడని సీఎస్‌కే సీఈవో వివరించాడు. రాయుడు, బ్రావో జట్టులో చేరితే సీఎస్‌కే లైనప్ మరింత బలంగా మారనుంది.
ఇక ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయాన్నందుకున్న చెన్నై తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో భారీ లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేసిన ధోనీసేన.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మరోసారి అలానే బోల్తా పడింది. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉంది.