
రెండు వరుస ఓటములు చెన్నై సూపర్ కింగ్స్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. టీమ్ మొత్తాన్నీ తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి. బౌలింగ్, బ్యాటింగ్.. ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఆ జట్టు లోపాలు బయటపడ్డాయి. బ్యాటింగ్ విభాగంలో సమన్వయం లేదు.. బౌలింగ్ లయ తప్పింది. ఒత్తిడి తట్టుకొని నిలదొక్కుకునే ఆటగాళ్లకు కొరత ఏర్పడింది. వెరసి దాని ప్రభావం- చెన్నై సూపర్ కింగ్స్ విజయావకాశాలపై పడింది. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆ జట్టు వరుసగా రెండు పరాజయాలను చవి చూసింది.
దీంతో చెన్నై మేనేజ్‌మెంట్, అభిమానులు టీమ్ లోపాలను ఎత్తిచూపారు. కోచ్ ఫ్లెమింగ్ సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా, అంబటి రాయుడు లేని లోటు స్పష్టంగా కనిపించిందనగా.. రాయుడు వస్తే అంతా సర్దుకుంటుందని ధోనీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో చెన్నై అభిమానులంతా #ComeBackMrIPL యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దీనికి తోడు కోచ్ ఫ్లేమింగ్ రైనా సేవలను గుర్తు చేసుకోవడంతో అతను మళ్లీ వచ్చే చాన్స్ ఉందా? అనే సందేహం అభిమానులకు కలిగింది.
ఇదే ప్రశ్నను ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ముందు ఉంచగా.. అలాంటిదేం లేదని స్పష్టం చేశారు. రైనా వైపు తాము చూడటం లేదని, టోర్నీకి దూరంగా ఉండటం అతని వ్యక్తిగత నిర్ణయమన్నారు. దాన్ని తాము గౌరవిస్తామని ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు.

'రైనా కోసం చూడటం లేదు. అతనే స్వయంగా టోర్నీకి దూరమయ్యాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. గేమ్ అన్నాక మంచి, చెడు రోజులు ఉండటం సాధారణమే. అభిమానుల ముఖం చిరునవ్వులను వెలగించడానికి ఏం చేయాలో మా ఆటగాళ్లకు బాగా తెలుసు. త్వరంలోనే మేం పుంజుకుంటాం'అని విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.
ఇక రాయుడు ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ.. అతను పూర్తిగా కోలుకున్నాడని, తదుపరి మ్యాచ్‌లో ఆడుతాడని తెలిపారు. 'ఇంతకు ముందే చెప్పా రాయుడు కేవలం ఢిల్లీ మ్యాచ్‌కు మాత్రమే దూరమవుతాడని చెప్పా. ప్రస్తుతం అతను ఫిట్‌గా ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌కు సిద్దమయ్యాడు.'అని చెన్నై సీఈవో స్పష్టం చేశారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచులో 48 బంతుల్లో 71 పరుగులతో అదరగొట్టిన రాయుడు తొడ కండరాలు పట్టేయడంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.