అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుంది. ప్లేయర్ స్వాప్ డీల్‌లో భాగంగా జడేజాతో పాటు సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసి సంజూ శాంసన్‌ను తీసుకుంది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సంజూ శాంసన్ కోసం 12 ఏళ్ల పాటు జట్టుకు ఆడిన ఆల్‌రౌండర్ జడేజాను వదులుకుంటారా? అని సీఎస్‌కే ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జడేజాను వదులుకోవడానికి, ఈ ట్రేడ్ డీల్ చేసుకోవడానికి గల కారణాలను సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. తప్పని పరిస్థితుల్లోనే జడేజాను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

'జట్టుకు టాపార్డర్ ఇండియన్ బ్యాటర్ కావాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ కోరుకుంది. కానీ వేలంలో ఎక్కువ మంది భారత బ్యాటర్లు లేరు. దాంతో ట్రేడ్ ద్వారా తెచ్చుకోవాలనుకున్నాం. ఈ క్రమంలోనే జడేజాను వదులుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలం జట్టుకు ఆడిన జడేజాను వదులుకోవడం కఠిన నిర్ణయమే. కానీ ఏం చేస్తాం మాకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు జట్టు ఆటగాళ్లతో టీమ్‌మేనేజ్‌మెంట్ చర్చించింది. వారి అంగీకారంతోనే ఈ ట్రేడ్ డీల్‌కు వెళ్లింది. ఈ విషయంలో రవీంద్ర జడేజా కూడా సానుకూలంగానే స్పందించాడు.
సామ్ కరణ్‌ను వదులుకోవడం కూడా కఠిన నిర్ణయమే. ఈ ఇద్దరూ తమ కెరీర్ చివరి దశలో ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నై జట్టును బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మేం భావించాం. మాకు ఇండియన్ బ్యాటర్‌ను పొందడానికి ఇంత కంటే మంచి ఆప్షన్ లేదు. సంజూ శాంసన్.. ఐపీఎల్‌లో చాలా అనుభవం ఉన్న ఆటగాడు. అతను ఇప్పటికే 4500 ప్లస్ రన్స్ చేశాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
జడేజా వదులుకున్న నేపథ్యంలో అభిమానుల బాధను మేం అర్థం చేసుకోగలం. కానీ మాకు మరో ఆప్షన్ లేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎస్‌కే ఫ్యాన్స్ చాలా మేసేజ్‌లు చేశారు. కానీ జట్టు మేలు కోసం మార్పులు చేయాల్సిందే. భవిష్యత్తులో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిలానే మెరుగైన ప్రదర్శన చేస్తుంది.'అని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు. గత 12 సీజన్లుగా సీఎస్‌కేకు ఆడిన జడేజా.. కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
చెన్నై తరఫున 186 మ్యాచ్‌లు ఆడి 143 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో 2198 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టుకు టైటిల్ అందించాడు. జడేజా ధరను రూ. 18 కోట్ల నుంచి రూ.14 కోట్లకు తగ్గించి రాజస్థాన్ రాయల్స్ తీసుకోవడం గమనార్హం. జడేజాకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కే ఛాన్స్ ఉంది.
సీఎస్‌కే ఫ్యాన్స్ బాధపడుతున్నా.. రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తిరిగిన రావడంపై జడేజా సంతోషం వ్యక్తం చేశాడు. 'ఆటగాడిగా నాకు తొలి అవకాశం ఇచ్చిందే రాజస్థాన్ రాయల్స్. తొలి సీజన్‌లోనే నాకు ఐపీఎల్ టైటిల్ విజయాన్ని రుచి చూపించింది. ఇన్నాళ్లకు నా హోమ్ టీమ్‌కు తిరిగి రావడం ప్రత్యేక అనుభూతినిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ నాకు కేవలం జట్టు మాత్రమే కాదు. నా సొంతిల్లు లాంటిది. రాజస్థాన్ రాయల్స్‌తోనే నేను తొలి టైటిల్ గెలిచాను. ప్రస్తుత టీమ్‌తో ఇలాంటి విజయాలు మరిన్ని సాధిస్తామని ఆశిస్తున్నా.'అని రవీంద్ర జడేజా పేర్కొన్నాడు.