IPL 2022 కరోనా కలకలం.. రద్దు చేయాలంటున్న సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌కు కరోనా సెగ తగిలింది. ఒకే నగరంలో అత్యంత పటిష్టమైన బయో బబుల్ మధ్య మ్యాచ్‌లు నిర్వహించినా.. వైరస్ ఆటగాళ్లకు సోకింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సహా ఢిల్లీ జట్టులోని ఐదుగురు కరోనా పాజిటీవ్‌గా తేలారు. దాంతో అప్రమత్తమైన బీసీసీఐ.. పంజాబ్, ఢిల్లీ మధ్య జరిగే మ్యాచ్ వేదికను మార్చింది. ముంబై నుంచి పుణేకు సుదీర్ఘ ప్రయాణం చేస్తే వైరస్ మరింత వ్యాప్తిచెందే ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు రెండు సార్లు ఆటగాళ్లకు డోర్ టూ డోర్ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆదేశించింది.
ఢిల్లీలో మరొకరికి పాజిటీవ్..
పంజాబ్‌తో మ్యాచ్ నేపథ్యంలో ముందుగా నిర్వహించిన యాంటీజెన్ పరీక్షలో న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌కు పాజిటీవ్‌గా తేలింది. అతని ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితం రావాల్సి ఉందని తెలుస్తోంది. అయితే సీఫెర్ట్ మంగళవారం టీమ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆటగాళ్లందరితో చనువుగా ఉన్నాడు. కరోనా కేసులు 6కు చేరిన నేపథ్యంలో లీగ్ కొనసాగించాలా? రద్దు చేయాలా? అనే చర్చ తెరపైకి వచ్చింది.
ట్రెండింగ్‌లో Cancel IPL
సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ 2022 సీజన్‌ను రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆటగాళ్ల, దేశ ప్రజల క్షేమాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సీజన్‌ను వాయిదా వేయాలని కొంతమంది నెటిజన్లు కోరుతున్నారు. మ్యాచ్‌లకు అభిమానులను కూడా అనుమతిస్తుండటంతో కరోనా వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందని, ఇప్పటికే పలు దేశాల్లో నాలుగో వేవ్ మొదలైందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోకపోతే పెను ప్రమాదం తప్పదంటున్నారు. ఈ క్రమంలోనే Cancel IPL హ్యాష్ ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.
సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్..
ఇదే అదునుగా భావించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఐపీఎల్ రద్దు చేయాలనే డిమాండ్‌కు వత్తాసు పలుకుతున్నారు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క విజయం సాధించలేదు. వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. వరుస పరాజయాలతో తీవ్ర నిరాశలో ముంబై ఫ్యాన్స్ లీగ్‌నే రద్దు చేయాలంటున్నారు. చెన్నై సైతం 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయాన్నందుకుంది. దాంతో ఆ జట్టు అభిమానులు కూడా రద్దు చేయడమే మంచిదంటున్నారు.
ఫన్నీ మీమ్స్..
ఇక ఐపీఎల్‌ను రద్దు చేయాలని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. క్యాన్సిల్ ఐపీఎల్ ట్యాగ్‌ను ట్రెండ్ చేసేందుకు చెన్నై, ముంబై అభిమానులు పోటీ పడుతున్నారని ఇతర జట్ల ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఐపీఎల్ రద్దు చేసే ముచ్చటే లేదనే ట్వీట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇక పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ మొదలైంది. ఇక కరోనా కేసులపై కూడా బీసీసీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. లీగ్ నిర్వాహణపై సమాలోచనలు చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications