
న్యూఢిల్లీ: కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ.. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 12 మధ్య లీగ్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుంది. గతేడాది జరిగినట్లుగానే షార్జా, దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో ఈ సీజన్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లు జరగనున్నాయి.
అయితే ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ యూఏఈ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ చానెల్ వివరాల ప్రకారం.. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించేలా ఇరు బోర్డులు ప్రయత్నాలు చేస్తున్నాయంట. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వారికే టికెట్లు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసిందట. అయితే భారత్ వేదికగా జరిగిన ఫస్ట్ ఆఫ్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించని విషయం తెలిసిందే. యూఏఈ వేదికగానే జరిగిన గత సీజన్‌లో కూడా ఫ్యాన్స్ లేకుండానే మ్యాచ్‌లు జరిగాయి.
అయితే లీగ్‌ను యూఏఈకి తరలించడానికి కరోనా వైరస్ కారణం కాదని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో భారత్‌లో వర్షాలు పడే అవకాశం ఉందని, వాతవరణ సమ్యసల వల్లే దుబాయ్‌కు తరలించినట్లు వెల్లడించాడు. 'సెప్టెంబరులో భారీగా వర్షాలు పడే అవకాశమున్నందున ఐపీఎల్‌ను ఇక్కడ నిర్వహించడం కష్టంగా ఉంటుంది. అందుకే యూఏఈలో జరపాలని నిర్ణయించాం" అని జై షా పేర్కొన్నారు.
2020లో మొత్తం టోర్నీకి ఆతిథ్యమిచ్చిన దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాల్లోనే ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు తాజా షెడ్యూల్ ప్రకారం చూస్తే తమ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడరని ఇంగ్లండ్ బోర్డు ఇప్పటికే ప్రకటించగా... కీలకమైన ఆస్ట్రేలియా బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎస్‌జీఎంలో విదేశీ ఆటగాళ్ల విషయంపై కూడా చర్చ జరిగింది.
అయితే ఎవరు వచ్చినా రాకున్నా, ఏ బోర్డునూ బతిమాలబోమని, మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడమే లక్ష్యమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే విండీస్ ఆటగాళ్ల కోసం కరీబియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బోర్డు కోరినట్లు అంతర్గత సమాచారం. ఆటగాళ్లు ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి స్థానాల్లో మరొకరిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలను బోర్డు అనుమతిస్తుంది.