టీమిండియా వెటరన్ క్రికెటర్, ఆంధ్ర ప్లేయర్ హనుమ విహారి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడా? కెరీర్ చివరి దశలో ఉన్న అతను మరో క్రికెటర్ అంబటి రాయుడు బాటలోనే పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అతను ఏపీ మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కలవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బాహటంగానే విమర్శలు గుప్పించిన హనుమ విహారి.. ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు తెలిపారు. కూటమి విజయానంతరం సోషల్ మీడియా వేదికగా హనుమ విహారి తన స్వరాన్ని పెంచాడు. ఓ రాజకీయ నాయకుడి తరహాలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు.

గత ప్రభుత్వంలో తాను ఎన్నో అవమానాలు పడ్డానని, కెప్టెన్‌గా తప్పుకోపోతే జట్టులో చోటు కోల్పోతావని హెచ్చరించారని పేర్కొన్నాడు. దాంతోనే తాను ఆంధ్ర జట్టును వీడాలనుకున్నానని తెలిపాడు. తాజాగా నారా లోకేష్ భరోసా ఇవ్వడంతో ఆంధ్ర జట్టులో కొనసాగాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు.
అసలు గొడవ ఏంటంటే..?
గత సీజన్ రంజీ ట్రోఫీ సందర్భంగా ఆంధ్ర జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి హనుమ విహారిని తప్పించారు. తొలి మ్యాచ్ ముగిసిన వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు. రికీ భుయ్ సారథ్యంలో ఆడిన ఆంధ్ర టీమ్ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ చేతిలో ఓటమిపాలైంది. ఈ పరాజయం అనంతరం హనుమ విహారి ఏసీఏపై సంచలన ఆరోపణలు చేశాడు.
జట్టులోని వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్ కొడుకును మందలించానని తనను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించాడు. తన కంటే ఓ కుర్రాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నచ్చలేదని, జీవితంలో మళ్లీ ఆంధ్ర జట్టుకు ఆడనని ఆవేదన వ్యక్తం చేశాడు.
విహారిని తప్పుబట్టిన ఏసీఏ..
విహారి ఆరోపణలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అప్పట్లో ఖండించింది. ఎన్‌ఓసీ ఇవ్వలేదనే అక్కసుతో విహారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఓ సుదీర్ఘ ప్రకటనను విడుదల చేసింది. 'టీమిండియాలో చోటు దక్కకపోవడంతో విహారి.. మధ్యప్రదేశ్‌కు వెళ్లాలనుకున్నాడు. ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్ పర్యవేక్షణలో బ్యాటింగ్ మెరుగుపరుచుకోవాలని భావించాడు.
అప్పటికే పలుమార్లు ఆంధ్ర జట్టులోకి వస్తూ పోయిన విహారి కారణంగా స్థానిక ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే అతనికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఏసీఏ నిరాకరించింది. కెప్టెన్సీ మార్పు వెనుక ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. జట్టు భవిష్యత్తు కోసం సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం. పృథ్వీరాజ్ అనే కుర్రాడిని హనుమ విహారి అకారణంగా తిట్టాడు.
గతంలో కూడా విహారిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పృథ్వీ రాజ్‌ను ఆడించకుండా గాయపడిన వికెట్ కీపర్‌ను జట్టులో కొనసాగించాడు.'అని ఏసీఏ హనుమ విహారి గురించి సంచలన విషయాలు బయట పెట్టింది.
మరో రెండేళ్లలో..
ప్రస్తుతం రంజీ ట్రోఫీ మాత్రమే ఆడుతున్న హనుమ విహారీకి మళ్లీ టీమిండియాలోకి వచ్చే అవకాశాలు లేవు. టెస్ట్ ఫార్మాట్‌లో కూడా అటాకింగ్ గేమ్‌కే ప్రాధాన్యత ఇస్తుండటంతో విహారి అవకాశాలు అందుకోలేకపోతున్నాడు. మరో మూడేళ్ల కంటే ఎక్కువగా అతను కెరీర్ కొనసాగించే అవకాశం లేదు. ఈ క్రమంలోనే అతను పొలిటికల్ ఎంట్రీ కోసం సమయాత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే టీడీపీ లేదా జనసేన తరఫున అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతాడని జోరుగా చర్చ సాగుతోంది.